అగ్రరాజ్యం అమెరికాలో తుపాను బీభత్సం సృష్టించింది. కాలిఫోర్నియాలో వరదలు ముంచెత్తాయి. దీంతో పలు ఏరియాల్లో 19 మంది చనిపోయారు. వందలాది ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అధికారులు 14వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి వారి ప్రాణాలను కాపాడారు. సోమవారం కూడా తుపాను ముప్పు ఉన్నట్టు ప్రజలను జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
కాలిఫోర్నియాలోని సాలినాస్ నది వరదతో పరివాహక ప్రాంతాల్లో పొంగి పొర్లుతోంది. జాతీయ రహదారులపై వరద నీరు ప్రవహిస్తోంది. మరో తుపాను పొంచి ఉన్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. వరద నీరు లోతట్టు ప్రాంతాల్లో ప్రవహిస్తోంది. వరదల వల్ల 34 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
మరోవైపు కాలిఫోర్నియా తుపాను మరణాలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విచారం వ్యక్తం చేశారు. వెంటనే ఎమర్జెన్సీని ప్రకటించారు. భారీ విపత్తు చోటు చేసుకున్నదని ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రజలకు అవసరమైన సాయం అంద జేయాలని అధికారులను ఆదేశించారు.
తీవ్ర శీతాకాల తుపాను వల్ల పోటెత్తిన వరదల వల్ల మట్టిచరియలు విరిగిపడ్డాయి. అలాగే బురద కూడా జనావాసాల్లోకి వచ్చి పడింది. కొందరు అందులో చిక్కుకోకా.. వారిని ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని బైడెన్ ఆదేశించారు. కాలిఫోర్నియాలో ఎమర్జెన్సీ ప్రకటించడంతో బాధితులకు తాత్కాలిక వసతి కల్పిస్తారు. మరో తుపాను పొంచి ఉన్న నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు.