ఆఫ్ఘనిస్తాన్ లో పౌరుల తరలింపు ఎంతో క్లిష్టమైన ప్రక్రియ అని అన్నారు అమెరికా అధ్యక్షుడు బైడెన్. తాలిబన్లు ఆఫ్ఘన్ ను ఆక్రమించిన తీరు విషయంలో అమెరికా వైఖరిపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో బైడెన్ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కాబూల్ నుంచి అమెరికన్లు, ఇతర విదేశీయులను తరలించడం కష్టమైన ఆపరేషన్ గా మారిందని అన్నారు.
ఆఫ్ఘాన్ లో ఒక్క అమెరికన్ ను వదలకుండా తీసుకువస్తామని ప్రకటించారు బైడెన్. ఇది అత్యంత సంక్లిష్టమైన తరలింపుగా అభివర్ణించారు. తుది ఫలితం ఎలా ఉంటుందో ఇప్పుడే హామీ ఇవ్వలేనని చెప్పుకొచ్చారు.
కాబూల్ విమానాశ్రయంలో తమ బలగాలతో కట్టుదిట్టమైన భద్రత ఉందని చెప్పిన బైడెన్… మిలటరీ విమానాలు మాత్రమే కాకుండా ఛార్టర్ ఫ్లైట్లు కూడా అందుబాటులో ఉన్నాయని చెప్పారు. తమ పౌరులను తరలించేందుకు అవి ఉపయోగపడతాయని అన్నారు. జులై నుంచి ఇప్పటికే 18 వేల మందిని తరలించామని.. ఆగస్టు 14 నుంచి సైనిక విమానాల్లో 13 వేల మందిని ఆఫ్ఘాన్ నుంచి బయటకు తీసుకొచ్చామని వివరించారు బైడెన్.