ఉత్తర కొరియాలో కరోనా విజృంభిస్తోంది. దేశంలో 2,19,030 మందిలో జ్వరం లక్షణాలను శుక్రవారం గుర్తించినట్టు అధికారులు వెల్లడించారు. దీంతో కేసుల సంఖ్య 24,60,640కు చేరుకున్నట్టు అధికారులు వివరించారు.
జ్వర లక్షణాలతో బాధపడుతున్న వారి సంఖ్య 2 మిలియన్లు దాటినప్పటికీ, కొవిడ్‌పై పోరాటంలో “మంచి ఫలితాలు” సాధిస్తున్నట్లు ప్రభుత్వం అంతకుముందు తెలిపింది.
ఉత్తరకొరియా తీవ్రమైన కొవిడ్ సమస్యలను ఎదుర్కొంటున్నట్టు కనిపిస్తోందని, యూఎస్ అధికారులు వెల్లడించారు. కొవిడ్‌తో సహా ఏ విషయంలోనైనా ఉత్తర కొరియాకు సహాయం చేయడానికి చర్యలు తీసుకోవడానికి యూఎస్ సిద్ధంగా ఉందని సీనియర్ బిడెన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు చెప్పారు.
అయితే ఉత్తర కొరియాకు తాము వ్యాక్సిన్లను ఆఫర్ చేశామని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ అన్నారు. ఈ విషయంలో ఉత్తరకొరియా నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాలేదని ఆయన వెల్లడించారు. ఉత్తర కొరియాతో పాటు చైనాకు సైతం వ్యాక్సిన్ ఆఫర్ చేశామన్నారు.