పంజాబ్‌లో గన్ కల్చర్ ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో విచ్చల విడిగా తుపాకుల వినియోగం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో గన్ కల్చర్ పై ఉక్క పాదం మోపాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు సీఎం భగవంత్ సింగ్ మాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రంలో 813 తుపాలకు సంబంధించిన లైసెన్సులను రద్దు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఆప్ సర్కార్ వచ్చాక ఇప్పటి వరకు 2వేలకు పైగా తుపాకుల లైసెన్సులను రద్దు చేసింది. తాజాగా రద్దైన లైసెన్సుల్లో ఎస్‌కేఎస్ కస్బా ప్రాంతంలోనే 235 తుపాకులు ఉన్నాయి.
షహీద్ భగత్‌సింగ్ నగర్‌లో 48, గుర్దాస్‌పూర్‌లో 10, లూథియా రూరల్‌లో 87, పఠాన్‌కోట్‌లో 199, ఫరీద్‌కోట్‌లో 84, హోషియాపూర్‌లో 45, కపుర్తలాలో 6, సంగ్రూర్‌లో 16 తుపాకులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. వీటితో పాటు అమృత్‌సర్ కమిషనరేట్ పరిధిలోని 27 మంది, జలంధర్ కమిషనరేట్‌లో 11, ఇతర జిల్లాల్లో మరికొంత మందికి తుపాకీ లైసెన్సులను ప్రభుత్వం రద్దు చేసింది.
ఆయుధ లైసెన్లు కలిగిన వారు ఆయుధాలను బహిరంగంగా ప్రదర్శించడంపై కూడా ప్రభుత్వం నిషేధం విధించింది. హింసను రేకెత్తించే విధంగా, ఆయుధాలను కీర్తించడంపైన కూడా పూర్తి స్థాయిలో నిషేధం ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది.