ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సంచలన విషయాలు బయట పడుతున్నాయి. రోజుకో ట్విస్ట్ తో ఢిల్లీ లిక్కర్ స్కామ్ షాక్ కి గురి చేస్తోంది. ప్రస్తుతం ఈ కేసు మరో మలుపు తిరిగింది. రిమాండ్ రిపోర్టులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును చేర్చింది ఈడీ. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరును వెల్లడించింది. రూ.100 కోట్లు అరేంజ్ చేసినవారిలో.. కవిత పేరు ఉన్నట్టు ఈడీ పేర్కొంది. పది సెల్‌ఫోన్లను కవిత డ్యామేజ్ చేసినట్టు.. రిమాండ్ రిపోర్టులో ఈడీ తెలిపింది.
సౌత్ గ్రూప్ కి రూ.100 కోట్ల ముడుపులు కవిత చెల్లించిందని ఈడీ పేర్కొంది. సౌత్ గ్రూప్ ను శరత్ రెడ్డి, కవిత, వైసీపీ ఎంపీ మాగుంట నియంత్రించారని ఈడీ పేర్కొంది. సౌత్ గ్రూప్ ద్వారా రూ.100 కోట్లను విజయ్ నాయర్ కు చేర్చినట్లు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ వెల్లడించింది. దర్యాప్తులో ఇచ్చిన వాంగ్మూలంలో అమిత్ అరోరా ధ్రువీకరించారని ఈడీ రిమాండ్ రిపోర్ట్ పేర్కొంది.
కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేసిన అమిత్ అరోరాను ఏడు రోజుల ఎన్ ఫోర్స్ మెంట్ కస్టడీకి రౌస్ అవెన్యూ సీబీఐ కోర్టు అనుమతించింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సన్నిహితుడైన అమిత్ ను అదుపులోకి తీసుకున్న ఈడీ.. 14 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరింది. అయితే కోర్టు 7 రోజులు అనుమతించింది.
ఇప్పటికే ఈడీ 22 సార్లు ప్రశ్నించిందని కోర్టుకు తెలిపాడు అమిత్. విజయ్ నాయర్, సిసోడియాను నేను ఎప్పుడూ కలవలేదని చెప్పారు. దీంతో 22 సార్లు ప్రశ్నించాక కూడా కస్టడీ అవసరం ఏంటని ఈడీని కోర్టు ప్రశ్నించింది. దీనికి ఈడీ రియాక్ట్ అవుతూ.. మూడు సార్లు వాంగ్మూలం నమోదు చేశామని సమగ్ర దర్యాప్తు కోసమే కస్టడీకి కోరుతున్నట్లు ఈడీ పేర్కొంది. దీంతో ధర్మాసనం 7 రోజులు కస్టడీకి అనుమతినిచ్చింది.
తాజాగా అరెస్ట్ తో కలిపి ఈ కేసులో ఇప్పటివరకు ఈడీ మొత్తం నలుగురిని అరెస్ట్ చేసింది. మరో ఇద్దరిని సీబీఐ కస్టడీ నుంచి అదుపులోకి తీసుకుంది. లిక్కర్ స్కామ్ కేసులో ఇటీవల మూడు వేల పేజీలతో చార్జ్ షీట్ ను దాఖలు చేసింది ఈడీ. ఇందులో సమీర్ ను ఏ1గా పేర్కొనగా, సిసోడియా పేరు మాత్రం చేర్చలేదు. అటు సీబీఐ కూడా ఎఫ్ఐఆర్ లో సిసోడియా పేరును చేర్చగా.. చార్జ్ షీట్ లో మాత్రమ రికార్డ్ చేయలేదు.