కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత బీఎన్ యడియూరప్ప సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన నియోజక వర్గ సీటును తన కొడుకు కోసం వదులు కుంటున్నట్టు తెలిపారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని స్పష్టం చేశారు. తన బదులుగా తన కుమారుడు శికారీపుర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని చెప్పారు.
‘నేను నా అసెంబ్లీ నియోజకవర్గాన్ని నా కుమారుడు బీవై విజయేంద్ర కోసం వదులుకుంటున్నాను. నా కుమారున్ని ఆదరించి, రాబోయే ఎన్నికల్లో ఆయన్ని భారీ మెజార్టీతో గెలిపించాలని శికారీపుర ఓటర్లను కోరుతున్నాను. రాబోయే ఎన్నికల్లో నేను పోటీ చేయను’అని అన్నారు.
పార్టీ తనను పక్కన పెట్టిందనే వాదనలను యడియూరప్ప ఖండించారు. ఆ వాదనల్లో వాస్తవం లేదన్నారు. ఈ వ్యాఖ్యలు చేసిన సరిగ్గా ఒక్క రోజు తర్వాత యడియూరప్ప సంచలన ప్రకటన చేయడం గమనార్హం.