భారత వైమానిక దళ అమ్ముల పొదలోకి మరో అస్త్రం చేరింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తేలికపాటి యుద్ద హెలికాప్టర్లను భారత వాయుదళంలోకి రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ రోజు ప్రవేశపెట్టారు. జోధ్ పూర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో రాజ్ నాథ్ సింగ్ తో పాటు నూతనంగా సీడీఎస్‌గా నియమితులైన జనరల్ అనిల్ చౌహన్, భారత వాయుదళ చీఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ… స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ తేలికపాటి యుద్ద హెలికాప్టర్ల చేరికతో మన వైమానిక దళ సామర్థ్యం మరింత పెరుగుతుందన ఆయన అన్నారు. రక్షణ రంగ ఉత్పత్తులను ఇది మరింత ప్రోత్సహిస్తుందన్నారు.
తాజాగా ఈ హెలికాప్టర్ల రాకతో భారత వైమానిక దళ యుద్ధ నైపుణ్యం మరింత మెరుగుపడనుంది. 5.8 టన్నుల బరువై న ఈ డబుల్ ఇంజిన్ హెలికాప్టర్లు పలు స్థాయిల్లో ఇప్పటికే ఫైరింగ్ టెస్టులను పూర్తి చేసుకున్నాయి. వీటిని ఎక్కువగా పర్వత ప్రాంతాల్లో మోహరించేలాగా రూపొందించారు.
ఇది శత్రు దేశాల రాడార్లను బోల్తా కొట్టించే సామర్థ్యం దీనికి ఉంది. రాత్రి పూట కూడా పోరాడగల సామర్థ్యం దీనికి ఉన్న మరో ప్రత్యేకత. నేలపై అత్యంత బలంగా తాకినా తట్టుకోగల దృఢమైన ల్యాండింగ్ గేర్‌ను ఇందులో ఏర్పాటు చేశారు. ఎలాంటి వాతావరణంలోనైనా ఇది ఆకాశంలో ఎగురగలదు.