తెలంగాణలో మరో భారీ భూ కుంభకోణం బట్టబయలైంది. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అన్నారం గ్రామపంచాయతీ పరిధిలో ఈ బిగ్ ల్యాండ్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. సర్వేనెంబర్ 261 లోని ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం చేసేందుకు భూ బకాసురులు భారీ స్కెచ్ వేశారు.
రియల్టర్లు, పెట్టుబడిదారులతో రెవెన్యూ అధికారులు, వివిధ పార్టీల లోకల్ లీడర్స్ కుమ్మక్కై.. ఈ భూ కుంభకోణానికి తెర లేపారు. ఇక ఈ సర్వే నెంబర్లో 588 ఎకరాల స్థలంలో ప్రభుత్వం, రైతులు, పేదలు,రిటైర్డ్ ఆర్మీ అధికారుల భూముల ఫ్లాట్లున్నాయి. దీని మార్కెట్ విలువ 1000 కోట్ల పైనే ఉంటుంది. ఇక కబ్జారాయుళ్లు పక్కా స్కెచ్ తో దర్జాగా ప్రభుత్వ భూమిలో లే అవుట్లు వేశారు. 2007లో పేదలకు ఇచ్చిన ప్లాట్లలో రియల్ దందాను చేసి..ఇందిరమ్మ కాలనీనే కనుమరుగు చేశారు.
గ్రీన్ లేక్ ప్రాపర్టీ డెవలపర్స్ పేరిట 10 ఎకరాల్లో ప్లాట్లను కూడా విక్రయించేశారు. ఇంతటితో ఆగని కబ్జా కంత్రీగాళ్ళు అప్పనంగా వచ్చిన ప్రభుత్వ వందల ఎకరాలను ఎర్రగడ్డలోని ఓ ప్రైవేట్ కంపెనీకి ధారాదత్తం చేసేందుకు ప్లాన్ కూడా వేశారు. ఇక ఈ భూబకాసురుల నుంచి అన్నదాతల భూమిని కాపాడడానికి అధికార పార్టీ అన్నారం గ్రామ సర్పంచ్ మాకం తిరుమల వాసు 2020 జూన్ లోనే గుమ్మడిదల పీఎస్ లో ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. దీంతో పాటు లోకాయుక్తలో ఫిర్యాదు చేసినా అధికార యంత్రాంగానికి మాత్రం చీమ కుట్టినట్టుగా కూడా లేకపోవడం ఆశ్చర్యం.
ఇక భూ బకాసురులను అడ్డుకున్న పాపానికి సర్పంచ్ ని తాజాగా సస్పెండ్ చేయించారు. కాంప్రమైజ్ కావాలని పెద్దలతో హుకుం జారీ చేసి..అప్పటికి సర్పంచ్ ఒప్పుకోకపోవడంతో అంతు చూస్తామని బెదిరింపులకు దిగుతున్నారు కబ్జా కంత్రీగాళ్ళు. దీంతో భయాందోళనకు గురైన సర్పంచ్ న్యాయం కోసం హైదరాబాద్లో మీడియా ముందుకు వచ్చారు. తనతో పాటు తన కుటుంబానికి ప్రాణ భయం ఉందని..తనకు ఏం జరిగినా.. రెవెన్యూ అధికారులు, స్థానిక లీడర్స్, పెట్టుబడిదారులదే బాధ్యతే అని అంటున్నారు సర్పంచ్ మాకం తిరుమల వాసు.
ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకొని తనను కాపాడాలని.. రైతులకు, పేదలకు, రిటైర్డ్ ఆర్మీ అధికారులకు న్యాయం చేయాలని సర్పంచ్ వేడుకుంటున్నారు. మరో వైపు భూ ఆక్రమణలపై పోరాటాన్ని ఆపనన్న ఆయన హైకోర్టులో పిల్ వేయడానికి సిద్దమవుతున్నారు. మరి సంగారెడ్డి నుంచి హైదరాబాద్ కు చేరిన ఈ భారీ భూ కుంభకోణం వ్యవహారం పై బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.