టీ కాంగ్రెస్ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. కొన్ని రోజుల నుంచి టీపీసీసీ సీనియర్లు చెబుతున్నట్టుగానే ఇప్పుడు కార్యాచరణలోకి దిగుతున్నారు. కౌంటర్ ఎటాక్ తోనే మైలేజ్ తెచ్చుకోవాలని వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటున్న టీ కాంగ్రెస్ ప్రస్తుతం తీసుకున్న కీలక నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో బిగ్ బ్రేకింగ్. అదేంటంటే..కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ అంటే ప్రస్తుతమున్న బీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అయిన 12 మంది ఎమ్మెల్యేల పై గురి పెట్టింది టీ కాంగ్రెస్.
కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ పార్టీకి మారిన12 మంది ఎమ్మెల్యే లపై మొయినాబాద్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతుంది టీపీసీసీ. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు సీఎల్పీ లో ముందుగా టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇంకా సీనియర్ కాంగ్రెస్ నాయకులు భేటి కానున్నారు. అక్కడ సమగ్రంగా ఈ వ్యవహారం పై చర్చించుకోనున్నారు. ఫిర్యాదులో ఏయే అంశాలను చేర్చాలి..పక్కా ప్రణాళికతో ఈ విషయంలో ముందుకు ఏవిధంగా వెళ్లాలి అనే దానిపై ఈ భేటీలో చర్చిస్తారు.
తరువాత అక్కడి నుంచి నేరుగా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆ 12 మంది ఎమ్మెల్యేల పై కాంగ్రెస్ ముఖ్య నాయకుల బృందం ఫిర్యాదు చేయనుంది. ఎందుకంటే ఎమ్మెల్యేల ఎర కేసుకు సంబంధించి మెయినాబాద్ పోలీసు స్టేషన్లోనే దర్యాప్తు ముందుగా చేయడం జరిగింది. దీంతో కౌంటర్ వేసినట్టుగా ఉంటుందని టికాంగ్రెస్ నేతలు అదే పోలీసు స్టేషన్లో జంప్ జిలానీలపై ఫిర్యాదు చేయాలని ప్లాన్ వేశారు. ఇక ఫిర్యాదులో 12 మంది ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ లో చేరినందుకు వారికి వచ్చిన రాజకీయ, ఆర్థిక లాభాల గురించి సవివరంగా తెలియజేయనుంది టీ కాంగ్రెస్.
మరో వైపు నలుగురు ఎమ్మెల్యే ల ఎర కేసు పై సిట్, సీబీఐలో దర్యాప్తు అదే విధంగా ఈ కేసుపై హైకోర్టులో వాదనలు జరుగుతున్న క్రమంలో టీ కాంగ్రెస్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం రాజకీయం సంచలనంగా మారింది. మరి టీ కాంగ్రెస్ ఈ చర్య ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారి తీస్తుందోనన్న ఆసక్తి నెలకొంది.