ఏపీ విద్యుత్ కొనుగోళ్లలో భారీ అవినీతి జరుగుతుందా…? వైసీపీ సర్కార్ పెద్దల కనుసన్నల్లో ఇది నడుస్తుందా…? అన్న ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. గత ప్రభుత్వహాయంలో విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అవినీతిని భయటకు తీస్తామని ఛాలెంజ్ చేసిన సీఎం జగన్ సర్కార్ కనుసన్నల్లోనే భారీ స్కాం జరుగుతుందన్న వాదన తెరపైకి వస్తుంది.
ప్రభుత్వ పరిధిలో ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుండి వచ్చే విద్యుత్ సరిపడకపోతే ఆ లోటును పూడ్చేందుకు ప్రభుత్వాలు ప్రైవేటు సంస్థల నుండి కరెంటు కొనుగోలు చేస్తుంది. ఇలా చేసిన కొనుగోలులోనే టీడీపీ సర్కార్ అవినీతి చేసిందని జగన్ గతంలో ఆరోపించారు. కానీ ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ కేంద్రాల్లో ఉత్పత్తి నిలిపేసి మరీ ప్రైవేటులో విద్యుత్ కొంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
డిసెంబర్, జనవరి నెలల్లో ఏపీ ప్రభుత్వం బయట నుంచి కరెంట్ కొనుగోలు చేసింది. రోజుకు 30 నుంచి 40 మిలియన్ యూనిట్లు కొనగా, ఇది రాష్ట్రం మొత్తం వినియోగంలో ఇరవై శాతానికి సమానం. ఇంత పెద్ద ఎత్తున విద్యుత్ కొనుగోలు జరగలేదు. పైగా ఒక్కో యూనిట్ కు మూడున్నర నుంచి నాలుగు రూపాయల వరకూ ఖర్చు పెడుతున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధం. నిర్ణయించిన ధర కంటే అధికం. దీన్ని గుర్తించిన విద్యుత్ నియంత్రణ మండలి డిస్కంలకు నోటీసులు జారీ చేసింది. అధిక ధరకుఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించింది. పైగా ప్రభుత్వ సంస్థలను షట్ డౌన్ చేసి కొంటున్నారు. గతంలోనూ ఇలాంటి ప్రశ్నలు రాగా… ప్రభుత్వం ఉత్పత్తి చేసే ఖర్చు కన్నా తక్కువగా బయట విద్యుత్ దొరుకుతుందని సమాధానం ఇచ్చారు. కానీ ఇప్పుడు రేటు పెంచి ఎందుకు కొంటున్నారని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.