– బీజేపీలోకి వస్తున్నారన్న బండి
– లేదు.. కాంగ్రెస్ లోనే ఉంటారన్న భట్టి
– కన్ఫ్యూజన్ లో ఇరు పార్టీల క్యాడర్
– కమలనాథులతో ఆగని కోమటిరెడ్డి సంప్రదింపులు
– ఒకవేళ రాజీనామా చేస్తే..
– ఉప ఎన్నికకు ఛాన్స్ ఉందా?
– టీఆర్ఎస్ అడ్డుకునే అవకాశం ఉందా? లేదా?
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం అటు కాంగ్రెస్ ఇటు బీజేపీలో హాట్ టాపిక్ గా మారింది. ప్రమోషనా? సస్పెన్షనా? రాజీనామానా? అనే చర్చ జోరుగా సాగుతోంది. అయితే ఇరు పార్టీల కీలక నేతల వ్యాఖ్యలు చేస్తున్న వ్యాఖ్యలు కార్యకర్తలను మాత్రం కన్ఫ్యూజన్ లో పడేస్తున్నాయి. తాజాగా మీడియాతో మాట్లాడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్… రాజగోపాల్ రెడ్డి త్వరలోనే బీజేపీలోకి చేరనున్నట్టు స్పష్టం చేశారు. ఆయన చేరికతో నల్గొండ జిల్లాలో బీజేపీ బలోపేతం అవుతుందని అన్నారు.
టీఆర్ఎస్ పై అవినీతి పోరాటం బీజేపీతోనే సాధ్యమవుతుందని నమ్మి కలిసివచ్చేందుకు కోమటిరెడ్డి సిద్ధమయ్యారనేది బండి వాదన. కాంగ్రెస్ టీఆర్ఎస్ కోవర్టు రాజకీయాలను ముందు నుంచీ రాజగోపాల్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. అయితే.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వ్యాఖ్యలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఢిల్లీలో రాష్ట్ర నేతలతో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సమావేశం తర్వాత భట్టి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర రాజకీయాలపైనే చర్చించామని.. త్వరలో కాంగ్రెస్ లో భారీ చేరికలు ఉంటాయని తెలిపారు. రాజగోపాల్ రెడ్డి.. అమిత్ షాను కలవడం యాదృచ్ఛికం కావొచ్చని అభిప్రాయపడ్డారు. బండి సంజయ్ కు రాజకీయ పరిజ్ఞానం లేదని విమర్శించారు.
రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లోనే ఉంటారనేది భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. ఆయన మనస్తాపం చెందితే చర్చించి పార్టీలో ఉండేలా చూస్తామని చెప్పారు. కానీ.. రాజగోపాల్ రెడ్డి మాత్రం బీజేపీ నేతలతో సంప్రదింపులు జరిపారు. ముఖ్య అనుచరులతోనూ భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఆగస్టు 10 తర్వాత ఎప్పుడైనా ఆయన కాంగ్రెస్ ను వీడే ఛాన్స్ ఉందని ప్రచారం సాగుతోంది. కానీ.. ఇరు పార్టీల నేతలు చేస్తున్న వ్యాఖ్యలతో కార్యకర్తలు మాత్రం కన్ఫ్యూజన్ లో ఉన్నారని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.
నిజంగా రాజగోపాల్ కాంగ్రెస్ ను వీడి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా? అనేది మరో చర్చ. ఆయన రిజైన్ చేసినా ఉపఎన్నిక సాధ్యమేనా అనే ప్రశ్న ఉత్పన్నమౌతోంది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వానికి ఇంకో 15 నెలలు మాత్రమే ఉంది. వచ్చే ఏడాది అక్టోబర్ లో ఎన్నికల షెడ్యూల్ వచ్చే ఛాన్స్ ఉంది. సాధారణంగా ఆరు నెలల కంటే పదవీ కాలం తక్కువ ఉంటే.. ఉపఎన్నిక పెట్టరు. ఆ ప్రకారం ఇప్పటికిప్పుడు రాజీనామా చేస్తే నిబంధనల ప్రకారం ఆరు నెలల్లో ఉపఎన్నిక నిర్వహించాలి ఆ తర్వాత పదవీ కాలం మరో ఆరేడు నెలలు మాత్రమే ఉంటుంది. ఉపఎన్నిక అనేది బీజేపీ వ్యూహం కాబట్టి.. ఈసీ దగ్గర ఉన్న పలుకుబడితో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తుందనే అనుకున్నా టీఆర్ఎస్ కూడా తన ప్లాన్స్ లో తాను ఉంటుందనే అంటున్నారు విశ్లేషకులు. రాజగోపాల్ రెడ్డి రాజీనామాపై స్పీకర్ ఎంత కాలం అయినా సాగదీయడానికి అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తమ కుర్చీ కిందకు నీళ్లు తెచ్చేందుకే రాజీనామా చేస్తున్నారని అనిపిస్తే.. టీఆర్ఎస్ ఆమోదించకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చని అంటున్నారు. గతంలో ఇలానే ఆవేశపడి ఈటల రాజీనామాను క్షణాల్లో ఆమోదించి టీఆర్ఎస్ చిక్కుల్లో పడింది. ఇప్పుడు మళ్లీ అది రిపీట్ చేయాలని టీఆర్ఎస్ అనుకోవడం లేదని చెబుతున్నారు విశ్లేషకులు.