కరోనా మహామ్మారి భూమ్మీదకు వచ్చాక మాస్కు, శానిటైజర్ మన నిత్య జీవితంలో భాగం అయ్యాయి. వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్నా కూడా.. ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టాలంటే మాస్కులు ధరిస్తూనే ఉన్నారు జనం. డాక్టర్లు కేవలం ఎన్-95 మాస్కులు వాడాలని సూచిస్తున్నప్పటికీ జనం ఏదో రకమైన మాస్క్ అయినా చాలులే అని ఫిక్స్ అయ్యారు. మాస్క్ అంటే కేవలం ముక్కును మూతిని కవర్ చేసి వైరస్ బారిన పడకుండా చేసే రక్షణ కవచం.
అయితే, ఓ కంపెనీ మాత్రం మన నిత్య జీవితంలో వాడే సాధారణ మాస్క్ కంటే 50 రెట్లు పెద్దదైన మాస్కును తయారుచేసింది. అంతా పెద్ద మాస్కా.. అంతా పెద్దగా ఎందుకు తయారు చేశారు అని అనుకుంటున్నారా.. దాని వెనుక ఓ ఆరోగ్యకర ప్రయోజనమే ఉందని ఆ కంపెనీ చెబుతుంది. కరోనా సమయంలో మాస్కుపై అవగాహన కల్పించేందుకు దీన్ని తయారు చేశారట. ఈ మాస్కు ఇప్పుడు గిన్నిస్‌బుక్‌లో చోటు సంపాదించుకుంది.
తైవాన్‌కు చెందిన ఓ వైద్య సంస్థ ఈ పెద్ద మాస్కును తయారుచేసింది. దీని పొడవు, వెడల్పులు 27 అడుగుల 3 అంగుళాలు, 15 అడుగుల 9 అంగుళాలు. ఈ మాస్కు రూపొందించాలనే ఆలోచన కొవిడ్ తీవ్రంగా ఉన్న సమయంలో తమకు వచ్చిందని తైవాన్‌కు చెందిన మోటెక్స్ హెల్త్‌కేర్ కార్పొరేషన్ తెలిపింది. వీడియో చాట్ ద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ న్యాయనిర్ణేత రికార్డును ధ్రువీకరించారు.