సంక్రాంతి నుంచి వాయిదా పడి సమ్మర్ కు షిఫ్ట్ అయ్యాయి పెద్ద సినిమాలు. వేసవి శెలవుల్ని ఫుల్ గా క్యాష్ చేసుకోవాలని అనుకున్నారు. కానీ అంతలోనే ఏపీలో టికెట్ ఇష్యూ వచ్చి పడింది. థియేటర్లపై దాడులు కూడా జరిగాయి. అవన్నీ మరికొన్ని రోజుల్లో ఓ కొలిక్కి రాబోతున్నాయి. టికెట్ రేట్లు కూడా పెరుగుతున్నాయి. అంతా సెట్ అనుకున్న టైమ్ లో ఊహించని సమస్య వచ్చి పడింది.
ఏ సమ్మర్ కోసమైతే టాలీవుడ్ ఆశగా ఎదురుచూస్తోందో.. ఆ సమ్మర్ ఇప్పుడు వాళ్లకు అందుబాటులోకి రావడం లేదు. అవును.. కరోనా వల్ల సిలబస్ సరిగ్గా పూర్తవ్వకపోవడంతో.. వేసవి శెలవుల్ని కుదించారు. పరీక్షల్ని వాయిదా వేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఏటా మార్చిలో పరీక్షలు మొదలవుతాయి. ఏప్రిల్ చివరి నాటికి పూర్తవుతాయి. కానీ కరోనా తగ్గడంతో ఏప్రిల్ లో కూడా పాఠాలు చెప్పబోతున్నారు. పరీక్షల్ని కాస్త ఆలస్యం చేశారు. పదో తరగతి పరీక్షల్ని మే 2 నుంచి ప్రారంభించబోతున్నారు. అలానే ఇంటర్మీడియట్ పరీక్షల్ని ఏప్రిల్ 8 నుంచి మొదలుపెట్టబోతున్నారు. దాదాపు ఇదే టైమ్ లో డిగ్రీ పరీక్షలు కూడా జరుగుతాయి.
ఇప్పుడీ నిర్ణయం టాలీవుడ్ పై పెద్ద ప్రభావం చూపించబోతోంది. మార్చి 25న ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజైతే.. ఏప్రిల్ లో ఆ సినిమాను ఎంత మంది చూస్తారనేది అనుమానాస్పదం. ఎందుకంటే, అంతా పరీక్షల కోసం సన్నద్ధం అవుతుంటారు. ఇక సరిగ్గా పరీక్షలు జరుగుతున్న టైమ్ లో కేజీఎఫ్ 2, బీస్ట్ లాంటి సినిమాలు వస్తున్నాయి. విద్యార్థులకు పరీక్షలంటే.. యూత్ ఆడియన్స్ తో పాటు, ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా కోల్పోయినట్టే.
ఇదే ఇప్పుడు పెద్ద సినిమాల్ని మరోసారి డైలమాలో పడేసింది. కేజీఎఫ్ 2, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు చెప్పిన తేదీకి వస్తాయా లేక మరోసారి వాయిదా పడతాయా అనేది డౌట్ గా మారింది. ఏప్రిల్ నెలాఖరులో రిలీజ్ అవుతున్న ఆచార్య, ఎఫ్3 లాంటి సినిమాలు కూడా అంతో ఇంతో ఇబ్బంది పడక తప్పదు.