నిర్మలమ్మ బడ్జెట్లో మధ్యాదాయ వేతన జీవులకు భారీ ఊరట లభించింది. . గతంలో 5 లక్షల వరకు ఉన్న పన్ను మినహాయింపును 7 లక్షలకు పెంచారు. మూడు లక్షల లోపు ఆదాయం గలవారికి పన్ను నుంచి మినహాయింపునిచ్చారు. 3 నుంచి 6 లక్షల లోపు ఆదాయం గలవారు 5 శాతం, 6 నుంచి 9 లక్షల ఇన్ కమ్ గలవారు 10 శాతం, 9 నుంచి 12 లక్షల ఆదాయం గలవారు 15 శాతం, 15 లక్షలు దాటితే 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం మీద ఏడాదికి 7 లక్షల లోపు ఆదాయం పొందుతున్నవారు ఎలాంటి పన్ను చెల్లించనక్కరలేదని ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు.
కొత్త పన్నుల విధానంలో ఆమె టాక్స్ స్లాబుల సంఖ్యను తగ్గించారు. పేదలు, మధ్యతరగతి వర్గాల ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకున్న తాము ఈ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నామన్నారు. రాష్ట్రాలకు మరింత ఊరటనిచ్చే విధంగా 50 ఏళ్ళ వడ్డీ లేని రుణాన్ని మరో ఏడాది వరకు పెంచామన్నారు.
రాష్ట్రాలకు నీతి ఆయోగ్ సపోర్ట్ మిషన్ మూడేళ్ళూ కొనసాగుతుందని ఆమె చెప్పారు. ఏడు అంశాలను తాము ప్రాధాన్యతా అంశాలుగా పరిగణించామని, దీన్ని ‘అమృత్ కాల్ లో గైడ్ చేస్తున్న సప్తర్షి’ గా అభివర్ణిస్తున్నామని ఆమె చెప్పారు.
నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగం అనంతరం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతూ వచ్చాయి. ఏకంగా 1200 పాయింట్లకు పైగా లాభంతో సెన్సెక్స్ దూసుకుపోగా, నిఫ్టీ 50 కూడా సుమారు 17,900 పాయింట్లతో కొనసాగింది.
ఆర్ధిక మంత్రి గంటా 26 నిముషాలపాటు ప్రసంగం కొనసాగించారు. ఆమె ప్రసంగం ముగించాక దలాల్ స్ట్రీట్ కళకళ లాడింది. ముఖ్యంగా ఐసీసీకి బ్యాంక్, టాటా స్టీల్, ఐ అండ్ టీ. హెచ్ఎఫ్ డీసీ, ఎల్ఐ సి, లాభాలు పొందగా అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎస్ బీ ఐ లైఫ్ ఇన్స్యురెన్స్ మొదలైనవి నష్టాలను చవి చూశాయి.