మూడు టాటా ట్రస్ట్‌ల కంపెనీలకు భారీ ఊరట లభించింది. ఆదాయం పన్ను చట్టంలోని 11 సెక్షన్ కింద ట్రస్టులకు ఇచ్చిన పన్ను మినహాయింపులకు సంబంధించిన విషయంలో ఎటువంటి అభ్యంతరానికి ఆస్కారం లేదంటూ ఇన్‌కం టాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ విస్పష్టమైన తీర్పునిచ్చింది. టాటా ట్రస్టు సమర్పించిన ఐటీ రిటర్న్స్‌లను తిరిగి అంచనా వేస్తామని ఆదాయం పన్నుశాఖ జారీ చేసిన ఆదేశాలను ఐటీఏటీ కొట్టేసింది.
ఐటీఏటీ చీఫ్ జస్టిస్ పీపీ భట్, ఉపాధ్యక్షుడు ప్రమోద్ కుమార్‌లతో కూడిన బెంచ్ టాటా ట్రస్టులపై సైరస్ మిస్త్రీ దాఖలు చేసిన పత్రాలపై అనుమానం వ్యక్తం చేసింది. 2016 అక్టోబర్ 24 న టాటా సన్స్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీ ఉద్వాసనకు గురైన తర్వాత ఆయన కొన్ని వారాలకే ఆదాయ శాఖకు పలు పత్రాలు పంపారు. టాటాలకు ఇచ్చిన మినహాయింపులను తొలగించాలని ఆయన కోరారు. అయితే, మిస్త్రీ పంపిన పత్రాలు ఐటీఏటీ దృవీకరించిన పత్రాలు కావని ట్రిబ్యునల్ తీర్పులో స్పష్టం చేసింది.