ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయ పరీక్షల్లో భారీ లీకేజీ బాగోతం జరిగిందా? పరీక్షల్లో గూడుపుఠాణి జరిగిందా? ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం కేంద్రంగా జరిగిన కుట్ర రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిందా? గోల్ మాల్ గోవిందాల దందా యథేచ్చగా సాగిందా? లోగుట్టు ఎవరికీ ఎరుక! జగన్ సర్కార్ దీనిపై ఏమంటుంది!?
గుంటూరు: గ్రామ సచివాలయ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ జరిగిందని ఒక పత్రికలో వచ్చిన కథనంతో అంతటా కలకలం బయలుదేరింది. ఇంత టఫ్ పేపర్ అయినా అన్ని మార్కులు ఎలా వచ్చాయి..? ఇదే అందరి సందేహం. ఆ పేపరు టైప్ చేసిన ఉద్యోగినే టాపరు కావడం ఈ సందేహాల్ని మరింత బలపరుస్తున్నాయి.
ఏపీపీఎస్సీ కేంద్రంగా గోల్ మాల్ వ్యవహారం సాఫీగా సాగిందని అభియోగాలు వస్తున్నాయి. దీనికి జగన్ సర్కార్ ఏమని బదులిస్తుంది ? ఎగ్జామ్స్ రద్దు చేస్తుందా? పచ్చ పేపర్ అని కొట్టి పారేస్తుందా ? కష్టపడి చదివిన అసలైన అభ్యర్ధులకు న్యాయం చేస్తుందా? గోల్‌మాల్ గోవిందాలకు వంతపాడుతుందా? ఈ ప్రశ్నలు చర్చనీయాంశమయ్యాయి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన టాపర్లలో అక్కడి ఉద్యోగులూ, వారి బంధువులూ ఉన్నారు. ఓ ఉద్యోగికి కేటగిరి-3లో రెండో ర్యాంకు, ఓ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగినికి టెన్త్ ర్యాంకు, ఓ ఉద్యోగి భార్య సహా ముగ్గురికి ర్యాంకు, అన్న ఉద్యోగి కాగా తమ్ముడు టాప్ ర్యాంకర్, రెండు కేటగిరీల్లోనూ ఫస్ట్, థర్డ్ ర్యాంకు రావడం వివాదాస్పదమవుతోంది.
అనితమ్మ కేటగిరి-1లో టాప్ ర్యాంకర్. ఏపీపీఎస్సీలో పరీక్షల వ్యవహారాలు చూసే విభాగంలో అనితమ్మ ఔట్‌సోర్సింగ్ విధానంలో జూనియర్ అసిస్టెంట్. ప్రశ్నపత్రం టైప్ చేసిందీ ఆమేనని కమిషన్ వర్గాలే అంటున్నాయి! ఈమెకు టాప్ ర్యాంక్ రావడంలో మతలబు ఏమిటో అధికారులకే తెలియాలి.
దొడ్డా వెంకట్రామిరెడ్డి కేటగిరి-3లో ఫస్ట్ ర్యాంకరు, కేటగిరి-1లో మూడో ర్యాంకరు. ఆయన సొంత అన్న ఏపీపీఎస్సీలో ఏఎస్‌వో. ఈ ర్యాంక్ వెనుక ఏదైనా గోల్ మాల్ ఉందా ? అదే అందరి డౌట్ !?
జిల్లాల్లోని తమకు అనుకూలురైన వారు అందరికీ ఈ పేపర్ అందజేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇదే జరిగితే కావాల్సిన వారికే పోస్టులు వస్తాయి. సర్వీసు కమిషన్ విశ్వసనీయత గోదాట్లో కలిసిపోతుంది.