మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాకే తగిలింది. నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న పల్లెం రవి కుమార్ గౌడ్ ఆయన భార్య కల్యాణి ఈరోజు టీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. టీఆర్ ఎస్ నుంచి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ బీజేపీ కండువా కప్పుకోవడంతో ఆ భర్తీని పూర్తి చేసుకోవడానికి టీఆర్ ఎస్ వారు పల్లె రవిని తన వైపునకు లాగేశారు.
గతంలో రవి ఇదే పార్టీలో ఉన్నప్పటికీ పదవులు రాలేదన్న అసంతృప్తితో కాంగ్రెస్ లో పార్టీ చేరారు. మునుగోడు ఉప ఎన్నికకు కాంగ్రెస్ తరుఫున టికెట్ వస్తుందని ఆశించినా అది అడియాశగా మిగలడంతో మళ్లీ టీఆర్ ఎస్ వైపునకు వచ్చారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనకు కండువా కప్పి ఆహ్వానించారు.
పల్లె రవి భార్య కల్యాణి ప్రస్తుతం చండూరు ఎంపీపీగా కొనసాగుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం నడిచిన కాలంలో జర్నలిస్టుగా, తెలంగాణ అభిమానిగా ఆమె యాక్టివ్ గా పాల్గొన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ లో టికెట్ రాకపోవడంతో భంగపడిన పల్లె రవికి భవిష్యత్తులో రాజకీయ అవకాశాలను కల్పించనున్నట్లు కేటీఆర్ హామీ ఇచ్చారు.
చండూరును రెవెన్యూ డివిజన్ చేయాలన్న ప్రతిపాదను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. సానుకూల స్పందన రావడంతో ప్రస్తుతం జరగనున్న ఉప ఎన్నికల్లో టీఆర్ ఎస్ తరుఫున ప్రచారం చేయనున్నట్లు స్పష్టం చేశారు.