పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పునివ్వడం.. అటు ఏపీ ప్రభుత్వం, ఇటు స్టేట్ ఎలక్షన్ కమిషన్‌కు ఇది ఊహించని పరిణామం. ఇన్నాళ్లు హైకోర్టు అండగా ఉందన్న ధైర్యంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఢీకొట్టిన నిమ్మగడ్డకు అదే హైకోర్టులో ఎదురుదెబ్బ తగలడం ఆశ్చర్యాన్ని కలిగిస్తే.. ఎప్పుడూ తమ అభ్యంతరాలను పట్టించుకోవడంలేదని హైకోర్టును తప్పుబట్టే ఏపీ సర్కార్‌కు కూడా తాజా తీర్పు హైవోల్టేజ్ షాక్ అని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
నిమ్మగడ్డ విషయానికి వస్తే… ఎన్నికల కమిషన్ చెప్పిందే పైనల్ అన్న న్యాయస్థానమే.. ప్రభుత్వ అభ్యంతరాలను పట్టించుకోలేదన్న వ్యాఖ్యలు చేయడం ఆయనకు మింగుడుపడని విషయంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఎస్ఈసీ, ఏపీ ప్రభుత్వం మధ్య జరుగుతున్న వార్‌లో చాలాసార్లు నిమ్మగడ్డవైపే కోర్టులు నిలబడ్డాయి. ఏపీ ప్రభుత్వం తీరుపై పదే పదే అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. తప్పు చేస్తున్నామని తెలిసినా ఏపీ సర్కార్ నిమ్మగడ్డ విషయంలో మొండిగానే ముందుకెళ్లి.. కోర్టుల చేత మొట్టికాయలు వేయించుకుంది. ఎన్నికల నిర్వహణ పూర్తిగా ఎన్నికల సంఘానికి సంబంధించినదే అని.. ప్రభుత్వమే సహకరించాలని కూడా ఇటీవల తేల్చి చెప్పింది. కోర్టు తీర్పుతో నిమ్మగడ్డ ఉత్సాహంగా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. ప్రభుత్వం ఇప్పుడే వద్దని గగ్గోలు పెట్టినా ముందుకే సాగారు.
మరోవైపు అటు కోర్టు తీర్పును కాదనలేక, ఇటు నిమ్మగడ్డను ఆపలేక చివరికి ప్రభుత్వం కూడా విధిలేక ఎన్నికలకు సిద్దమవుతోంది. కోర్టులో పిటిషన్ వేసినప్పటికీ.. అనుకూలమైన తీర్పు వస్తుందని అస్సలు ఊహించలేదు. అలాంటిది ఎన్నికల షెడ్యూల్‌ను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పునివ్వడం ఏపీ సర్కార్ కూడా ఇంకా నమ్మలేని పరిస్థితుల్లోనే ఉందంటున్నారు విశ్లేషకులు.