బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పెద్ద షాక్ తగిలింది. జమున హ్యాచరీస్ కోసం భూములు కబ్జా చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సర్వే నిర్వహించిన అధికారులు.. ఆక్రమణకు గురైన భూములను గుర్తించారు. బుధవారం మాసాయిపేట మండలం హకీంపేట, అచ్చంపేటకు చేరుకున్న మెదక్, తూప్రాన్, నర్సపూర్ ఆర్డీవోలు.. భూమి పంచనామా నిర్వహించారు.
అచ్చంపేటలోని 77, 78, 79, 80, 81, 82, 130 సర్వే నెంబర్లలోని మొత్తం 84 ఎకరాల భూమి, హాకింపేట సర్వే నెంబర్ 97లో ఒక ఎకరం భూమి.. మొత్తం 85 ఎకరాల 19 గుంటల భూమి గ్రామస్తులకు పంచారు. జమున హ్యాచరీస్ ప్రక్కన ఉన్న గేట్ల తాళాలు పగులగొట్టి అంచ్చపేట సర్పంచ్ భర్తతో కలిసి గ్రామ రైతులు లోపలికి ప్రవేశించారు. ఈటలపై ఆరోపణలో ఉన్న హ్యాచరిస్ కంపెనీలోకి ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే, రైతులు ప్రవేశించారు.
ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, మసాయిపేట ఎమ్మార్వో మాలతి, జమున హ్యాచరిస్ లో ఉన్న భూమి పంచనామను.. హకీంపేట గ్రామానికి చెందిన శ్యామలకు అందజేశారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దగ్గరుండి మొత్తంగా 85 ఎకరాల భూమి పొజిషన్ ను 65 మంది రైతులకు భూమి పట్టాలు పంపిణీ చేసినట్టు అధికారులు చెప్తున్నారు.
ఈటల రాజేందర్ కబ్జా చేసిన భూములను తిరిగి రైతులకు పంపిణీ చేస్తున్నామని వ్యాఖ్యానించారు ఎంపీ ప్రభాకర్‌రెడ్డి. కబ్జా భూమిలో నిర్మించిన షెడ్లను కోర్ట్ ఆదేశాలతో ఏం చేయాలో ఆలోచిస్తామని తెలిపారు. కబ్జాకు గురైన భూమి పట్టాలు తమ చేతికి చేరడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు ప్రభాకర్ రెడ్డి.