నిజామాబాద్ జిల్లాలో బీజేపీకి ముఖ్యంగా ఎంపి అరవింద్ కు షాక్ ఇస్తూ ముగ్గురు బీజేపీ కార్పొరేటర్లు టీఆరెఎస్ పార్టీలో చేరారు. తెలంగాణలో ఆ పార్టీ కాస్త మెరుగ్గా ఉన్న ప్రాంతాల్లో నిజామాబాద్ కూడా ఒకటి. నిజామాబాద్ 8వ డివిజన్ కార్పొరేటర్ విక్రమ్ గౌడ్, 9వ డివిజన్ సాధు సాయి వర్ధన్, 50వ డివిజన్ బట్టు రాఘవేందర్(రాము) శుక్రవారం గులాబీ కండువా కప్పుకున్నారు.
హైదరాబాద్‌లోని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నివాసంలో, ఎమ్మెల్యే గణేష్ గుప్తా ఆధ్వర్యంలో వారు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్లు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు నచ్చి తాము గులాబీ పార్టీలో చేరినట్లు తెలిపారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక త్వరలో ఉన్న నేపథ్యంలో ముగ్గురు కార్పొరేటర్లు బీజేపీని వీడడంతో ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.