అప్పుల కుప్పగా మారిన ఏపీ బండిని ముందుకు లాగేందుకు నానా తంటాలు పడుతోంది ప్రభుత్వం. ఆఖరికి ఆర్థిక సంఘం నిధులను కూడా మళ్లిస్తున్న పరిస్థితి. అయితే జగన్ సర్కార్ కు గట్టి ఎదురు దెబ్బే తగిలింది. ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వచ్చే నిధుల కోసం ప్రత్యేక అకౌంట్లను పంచాయతీ పేరిట ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో పంచాయతీ రాజ్ కమీషనర్.. జెడ్పీ సీఈఓలు, జిల్లా పంచాయతీ అధికారులకు ఆదేశాలు పంపారు. 15వ ఆర్ధిక సంఘం నిధులు ఇక నుంచి ఈ అకౌంట్స్ లోనే వేస్తామని తెలిపారు. ఇవన్నీ గ్రామ పంచాయతీ పేరు మీద, యూనియన్ బ్యాంక్ లో ప్రారంభించాలని స్పష్టం చేశారు.
14, 15వ ఆర్ధిక సంఘం నిధులను ఏపీ ప్రభుత్వం విద్యుత్ బిల్లుల బకాయిల పేరిట డ్రా చేస్తుండడం వివాదాస్పదమైంది. ప్రతిపక్షాలు ప్రభుత్వ చర్యను తప్పుబట్టాయి. పంచాయతీలను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని.. నిధులన్నీ ఇతర అవసరాలకు వాడితే గ్రామాల్లో అభివృద్ధి ఏం జరుగుతుందని ప్రశ్నించాయి. అయినా కూడా జగన్ సర్కార్ తన పంథా మార్చుకోలేదు. దీంతో వరుస నిధుల మళ్లింపుపై కేంద్ర ప్రభుత్వానికి కుప్పులు తెప్పలుగా ఫిర్యాదులు వెళ్లాయి.
ఏపీ నుంచి వస్తున్న ఫిర్యాదులపై స్పందించిన కేంద్రం.. ఈ ఇష్యూను చాలా సీరియస్ గా తీసుకుంది. ఆర్థిక సంఘం నిధులు పంపేందుకు ప్రత్యేక అకౌంట్లను పంచాయతీ పేరిట ప్రారంభించాలని కీలక ఆదేశాలు జారీ చేసింది కేంద్రం.