క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు ఆయన ఫ్యాన్స్ భారీ షాకిస్తున్నారు. రైతుల ఉద్యమాన్ని సమర్థించిన అంతర్జాతీయ ప్రముఖులను తప్పుబడుతూ సచిన్ చేసిన ట్వీట్‌పై ఊహించని విధంగా.. ఆయనపైనే తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు. రైతుల పోరాటాన్ని సమర్థించాల్సిందిపోయి.. కేంద్ర ప్రభుత్వంతో పాటే కార్పొరేట్లకు వంతపడుతున్నారా అంటూ నిలదీస్తున్నారు. ఈ క్రమంలోనే కేరళకు చెందిన ఫ్యాన్స్ అయితే మరో అడుగు ముందుకేశారు.
సచిన్ ఎవరో తెలియదంటూ కామెంట్లు చేసి, ఏడేళ్ల క్రితం భారీ ట్రోలింగ్స్‌కు గురైన రష్యన్ టెన్నిస్ దిగ్గజ క్రీడాకారిణి మరియా షరపోవా ఫేస్‌బుక్ వాల్‌పైకి చేరిన సచిన్ కేరళ ఫ్యాన్స్ ఆమెకు క్షమాపణలు చెబుతున్నారు. తాము తప్పు చేశాం మన్నించమంటూ ఆమెను కోరుతున్నారు. సచిన్ గురించి నాడు అలా మాట్లాడటం తప్పేమీ కాదని సమర్థిస్తున్నారు. నిన్నటి నుంచి మళయాళం భాషలో క్షమాపణలు చెబుతున్న మెస్సేజ్‌లతో ఆమె వాల్ నిండిపోయింది. మళయాళంలో ఉన్న కామెంట్ల అర్థం తెలుసుకుని షరపోవా ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు.
పాప్ సింగర్ రిహన్నా, పర్యావరణ ప్రేమికురాలు గ్రెటా థన్ బర్గ్ రైతులకు అనుకూలంగా స్పందించడాన్ని సచిన్ పరోక్షంగా తప్పుబట్టారు. భారతదేశానికి సంబంధించిన విషయంలో ఇతర దేశాలకు చెందిన వారిలాగా మనం జోక్యం చేసుకోవద్దంటూ తన ట్వీట్ చేశాడు. అయితే సచిన్ వ్యాఖ్యలు రైతులకు మద్దతుగా కాకుండా కేంద్రానికి అనుకూలంగా ఉండటంతో ఆయనపై ట్రోలింగ్ స్టార్ట్ అయింది. రైతులు, కేంద్రం మధ్య మ్యాచ్ ఆడాల్సి వస్తే.. సచిన్ ప్రభుత్వం కోసం బ్యాటింగ్ చేస్తాడంటూ ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. రైతుల గురించి తెలియనప్పుడు.. నోరు మూసుకుని ఉండటం సచిన్‌కు బెటర్ అంటూ మండిపడుతున్నారు.