– ప్రవీణ్ ఫోన్ లో టీఆర్ఎస్ నేతల నెంబర్లు
– ఈడీ నెక్ట్స్ టార్గెట్ వాళ్లేనా?
– లావాదేవీలపై దృష్టి పెట్టనుందా?
– చికోటికి పుట్ట మధుకు ఉన్న లింకేంటి?
చర్చనీయాంశంగా మారిన క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ వ్యవహారంలో గులాబీ నేతల పేర్లు బయటకొస్తున్నాయి. అతనితోపాటు పలువురు నేతలు హవాలా దందాలో భాగస్వామ్యం అయినట్లు చర్చ సాగుతోంది. ముఖ్యంగా హైకోర్టు అడ్వకేట్ దంపుతులు గట్టు వామన్ రావు, నాగమణి హత్య సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పుట్ట మధు పేరు తెరపైకి వచ్చింది.
చికోటి ప్రవీణ్ తో హవాలా వ్యవహారంలో పుట్ట మధు కీలక భాగస్వామిగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అతనితోపాటు ఓ గ్రైనేట్ వ్యాపారి నేపాల్ పర్యటనకు వెళ్లినట్లు తెలుస్తోంది. అలాగే.. హవాలా లావాదేవీల కోసం మూడు రోజులు దుబాయ్ టూర్ కు వెళ్లినట్లుగా సమాచారం. ఈడీ ఎంట్రీతో చికోటి ప్రవీణ్ బాగోతాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి.
7 నెలల్లో 7 దేశాల్లో క్యాసినో నిర్వహించాడు ప్రవీణ్. శ్రీలంక, ఇండోనేషియా, నేపాల్, సింగపూర్, థాయ్ లాండ్ లలో క్యాసినోలు ఏర్పాటు చేశాడు. ఇప్పటివరకు వెయ్యిమందిని విదేశాలకు తీసుకెళ్లి క్యాసినో ఆడించినట్లు అధికారులు గుర్తించారు. సంపత్ అనే వ్యక్తి విమానాలు బుక్ చేశాడని.. ఒక్కొక్కరి నుంచి రూ.3 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది.
చికోటి ప్రవీణ్, మాధవరెడ్డి, సంపత్ అకౌంట్లలో భారీగా నగదును గుర్తించారు అధికారులు. అకౌంట్లలో నగదు లెక్కలు చెప్పాలంటూ ఈడీ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ లో 8 చోట్ల జరిపిన సోదాల్లో భారీగా నగదు గుర్తించారు. శ్రీలంకలో ఈనెల 8 నుంచి 17 వరకు 2 సార్లు క్యాసినో నిర్వహించారని.. ఫంటర్స్ ను ఉదయం విమానంలో తీసుకెళ్లి సాయంత్రం హైదరాబాద్ తీసుకొచ్చినట్లు సమాచారం.