ఢిల్లీ మేయర్ ఎన్నిక వ్యవహారంలో ఆప్ కి సుప్రీంకోర్టు నుంచి ‘పెద్ద’ ఊరట లభించింది. ఈ ఎన్నికలో ఓటు చేసేందుకు ఆల్డర్ మెన్ కి హక్కు లేదని శుక్రవారం తీర్పునిచ్చింది. వీరు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులు.. వీరిని లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సేనా నామినేట్ చేశారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలో ఈ నామినేటెడ్ సభ్యులు ఓటు చేయడానికి వీలు లేదని, వీరంతా బీజేపీ మాజీ అసోసియేట్ సభ్యులని ఆప్ కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలు గతంలో చాలాసార్లు వాదించారు.
దీనిపైనే బీజేపీ కౌన్సిలర్లకు, వీరికి మధ్య పెద్దఎత్తున రభస జరిగి మూడు సార్లు మేయర్ ఎన్నిక వాయిదా పడింది. దీంతో తాము కోర్టుకెక్కుతామని ఆప్ సభ్యులు లోగడే హెచ్చరించారు. వీరి పిటిషన్ ను విచారించిన కోర్టు.. నామినేటెడ్ సభ్యులు ఓటు వేయజాలరని నిర్ణయించింది.
తొలి ఎంసిడీ మీటింగ్ లోనే నగర మేయర్ ఎన్నిక ప్రక్రియను నిర్వహించాలని, మేయర్ ఎన్నికయ్యాక.. ఆయన.. డిప్యూటీ మేయర్, స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నికకు ప్రిసైడింగ్ అథారిటీగా వ్యవహరిస్తారని కోర్టు స్పష్టం చేసింది. అంటే ముందే మేయర్ ఎన్నిక జరగాలని పేర్కొంది. మేయర్ పదవికి ఎన్నిక తేదీకి సంబంధించి నోటీసును 24 గంటల్లో జారీ చేయాలని కూడా కోర్టు సూచించింది.
ఢిల్లీ మేయర్ ఎన్నిక త్వరగా జరిగేలా చూడాలని కోరుతూ.. ఆప్ నేత, మేయర్ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ దాఖలు చేసిన పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం విచారించింది.