తమ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ రాజీనామాను ఆమోదించిందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు మహారాష్ట్రలో శివసేన (ఉద్ధవ్ థాక్రే వర్గం) నేత ఆదిత్య థాక్రే కృతజ్ఞతలు తెలిపారు. ఇది మా రాష్ట్రానికి పెద్ద విజయమేనన్నారు. కోష్యారీ అదేపనిగా ఛత్రపతి శివాజీ మహారాజ్ ని, మహాత్మా జ్యోతిబా ఫూలేని, సావిత్రి బాయి ఫూలేని, రాజ్యాంగంతో బాటు అసెంబ్లీని కూడా ఎన్నోసార్లు విమర్శిస్తూ వచ్చారని ఆయన అన్నారు. కోష్యారీని గవర్నర్ గా అంగీకరించే ప్రసక్తే లేదన్నారు.
తనను పదవి నుంచి తప్పించాలని, ఇక విశ్రాంతిగా పుస్తకాలు చదువుకుంటూ. సాహితీ పఠనం చేస్తూ కాలం గడుపుతానని భగత్ సింగ్ కోష్యారీ ఇటీవల రాష్ట్రపతికి లేఖ రాశారు. 2019 సెప్టెంబరులో ఈయన రాష్ట్ర గవర్నర్ గా పదవి స్వీకరించగానే నాడు రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తూ హడావుడిగా దేవేంద్ర ఫడ్నవీస్ ని సీఎంగా, అజిత్ పవార్ ని డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించినందుకు విపక్షాల నుంచి తీవ్ర విమర్శలనెదుర్కొన్నారు.
అప్పుడు బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలని తీసుకున్న నిర్ణయంతో శివసేన… మహారాష్ట్ర వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సన్నాహాల్లో ఉంది. చీలిన ఎన్సీపీవర్గం లోని అజిత్ పవార్ తో కలిసి ఫడ్నవీస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా అది మూడు రోజులపాటు మాత్రమే అధికారంలో ఉంది.
అలాగే ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం అధికారంలో కొనసాగిన రెండున్నర ఏళ్లకాలంలోనూ ఆ సర్కారుకి, కోష్యారీకి మధ్య పలు అంశాల్లో విభేదాలు ఏర్పడ్డాయి. గుజరాతీలు, మార్వాడీలు ఈ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయకపోయి ఉంటే ముంబై ఈ దేశ వాణిజ్య రాజధాని అయి ఉండేది కాదని వ్యాఖ్యానించి ఆయన వివాదం రేపారు. చివరికి తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారు. ఇలా మహారాష్ట్ర గవర్నర్ గా ఆయన ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నారు.