బోల్డ్ కామెంట్స్ తో సోషల్ మీడియాలో ఓ ట్రెండ్ సెట్ చేసిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 కంటెస్టెంట్, యూట్యూబ్ స్టార్ సరయును పోలీసులు అరెస్టు చేశారు. హోటల్ ప్రచార సాంగ్ లో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించారని సరయుపై వీహెచ్‌పీ నేత ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆ వీడియో మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉందన్న అభియోగంపై 153a, 295a సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసులో భాగంగా యూట్యూబ్ నటి సరయుని బంజారాహిల్స్ పోలీసులు సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. సరయుపై చర్యలు తీసుకోవాలంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు చేపూరి ఆశోక్ సిరిసిల్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
తన హోటల్ ప్రమోషన్ లో భాగంగా హిందువులను కించపరిచారని ఫిర్యాదులో పేర్కొన్నారు. హోటల్ ప్రచార సాంగ్ లో సరయు ఇతరులు గణపతి బప్పా మోరియా బ్యాండ్ ను తలకు ధరించి మద్యం సేవించారని అన్నారు. దేవుడి బొమ్మలు ధరించి మద్యం సేవించి హోటల్స్ దర్శిస్తారనే సంకేతాన్ని పంపుతున్నారని వీహెచ్‌పీ నేత ఆక్షేపించారు.
హిందువులను కించపరిచే చర్యలకు పాల్పడితే హిందూ సమాజం సహించదన్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన సిరిసిల్ల పోలీసులు.. సరయు బంజారాహిల్స్ లో ఉంటుండటంతో ఆ కేసును హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ కు ట్రాన్స్ ఫర్ చేశారు.