కొద్ది రోజుల క్రితం రాజస్థాన్ లో ముగ్గురు మేనమామలు కలిసి మేనకోడలికి 3 కోట్ల రూపాయల కట్నం ఇచ్చి పెళ్లి ఘనంగా చేశారు. ఇంకా ఆ విశేషం పలువురి నోట్లో నానుతూనే ఉంది. ఈ క్రమంలోనే మరో వివాహం అంతకు మించిన ప్రాధాన్యత సంతరించుకుంది. తన సోదరి మీద ఉన్న ప్రేమతో ఇద్దరు సోదరులు ఆమెకు పెళ్లి కానుకగా ఏకంగా 8 కోట్ల కట్నం ఇచ్చారు.
ఆ కట్నాన్ని మగ పెళ్లివారికి అందించడానికి ఏకంగా వందల మంది తరలి వెళ్లారు. దీంతో సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. వందలాది కార్లు, ట్రాక్టర్లు, ఒంటెల బండ్లు, ఎద్దుల బండ్లతో సోదరి నివాసానికి చేరుకున్నారు. రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలోని ధింగ్‌సార గ్రామానికి చెందిన అర్జున్ రామ్ మెహారియా, భగీరథ్ మెహారియాలు కలిసి తన సోదరికి వివాహాం జరిపించారు.
దీనిలో భాగంగా వీరు తమ చెల్లికి కానుకగా దాదాపు రూ.8.1 కోట్ల విలువ చేసే ఆస్తులను కానుకగా అందించారు. ఇలా పెళ్లి వేడుకకు కట్న కానుకలు సమర్పించడాన్ని మైరా అంటారు. ఈ సోదరులు తమ సోదరికి మైరాలో రూ.2.21 కోట్ల నగదుతో పాటు, 1.105 కేజీల బంగారం, 14 కేజీల వెండి ఉన్నాయి.
అంతేకాకుండా రూ.4.42 కోట్లు విలువ చేసే భూమిని కానుకగా అందించారు. అవే కాకుండా ఆ సోదరులు తన సోదరి కోసం ఓ ట్రాక్టర్ గోధుమలు, స్కూటీతో పాటు మరి కొన్ని వాహనాలు, నగలను కట్నంగా సమర్పించారు. ఈ ఆచారం తమ కుటుంబంలో ఎన్నో ఏళ్ల నుంచి జరుగుతుందని ఆ సోదరులు చెప్పారు.