బీజేపీపై బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మరోసారి బీజేపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. ఇక నుంచి తాము కేవలం సోషలిస్టు పార్టీలతో మాత్రమే జతకడతామని వెల్లడించారు.
అహంకారంతో కండ్లు మూసుకుపోయిన నేతలు కేంద్రంలో పరిపాలన చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. వారు దేశాభివృద్ధి కోసం కాకుండా ఈ సమాజంలో చీలికలు తెచ్చేందుకే పనిచేస్తున్నారంటూ ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
తన జీవితంలో మరోసారి బీజేపీతో పొత్తులు గానీ, కలిసి పనిచేయడం లాంటివి గాని వుండవని ఆయన స్పష్టం చేశారు. బిహార్ ను అభివృద్ధిచేయడానికి సోషలిస్టు భావజాలం కలిగిన పార్టీలతో కలిసి పనిచేస్తూ ముందుకు వెళ్తానని ఆయన వెల్లడించారు.
ఈ సందర్భంగా బీజేపీ అగ్రనాయకులు అటల్ బిహారీ వాజ్‌పేయి, లాల్ కృష్ణ అద్వాని, మురళీ మనోహర్ జోషి వంటి పలువురు నాయకులను ఆయన గుర్తుచేసుకున్నారు. ఆ నాయకులంతా దేశం కోసమే పనిచేశారని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు ఆ పార్టీ మొత్తం అహంకారులతో నిండిపోయిందన్నారు.