బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వియాదవ్, ఆయన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ పై తప్పుడు కేసులు బనాయించి వేధిస్తోందని ఆయన అన్నారు. బిహార్‌లో మహాకూటమి ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ చేయని కుట్ర లేదని ఆయన ఆరోపణలు గుప్పించారు.
అందుకే తాను చావనైనా చస్తానుగానీ బీజేపీతో మరోసారి పొత్తు పెట్టుకోబోనని ఆయన తెగేసి చెప్పారు. తేజస్విపై, లాలూపై బీజేపీ చేస్తున్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని వెల్లడించారు. ఆర్జేడీని నేతలను వేధించి కూటమిని విడదీస్తే తాను బీజేపీ వాళ్ల దారికి వెళతానని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారని చెప్పారు.
నితీశ్ కు వేరే గత్యంతరం లేదని, రాబోయే ఎన్నికల్లో తిరిగి బీజేపీతో పొత్తు పెట్టుకుంటారని ఆ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఈ మేరకు ఆయన స్పందించారు. ఇది ఇలా వుంటే ప్రజాధరణ కోల్పోయిన నితీశ్‌కుమార్ మళ్లీ బీజేపీతో దోస్తీకి ప్రయత్నిస్తారని రాష్ట్ర బీజేపీ చీఫ్ సంజయ్ జైశ్వాల్ అన్నారు.
నితీశ్ ఓ నమ్మద్రోహి అని, అతని చేతిలో మరోసారి మోసపోయేందుకు తాము సిద్ధంగా లేమని ఆయన అన్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో మొత్తం 40 స్థానాలకుగాను 36 స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.