- రాహుల్, ఏచూరీలతో చర్చలు.. విపక్ష ఐక్యతే లక్ష్యం
2024 ఎన్నికలే లక్ష్యంగా విపక్షాలను ఒక్కతాటిపైకి తెచ్చేందుకు బీహార్ సీఎం నితీష్ కుమార్ నడుం కట్టారు. జాతీయ రాజకీయాలే ధ్యేయంగా నిన్న ఢిల్లీ చేరుకున్న ఆయన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని కలుసుకున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించిన ఆయన .. ఆ తరువాత సీపీఎం నేత సీతారాం ఏచూరితో చాలాసేపు భేటీ అయ్యారు. ప్రధాని పదవికి రేసులో లేనని, అసలా ఉద్దేశమే లేదని ఆయన మళ్ళీ స్పష్టం చేశారు. కేవలం విపక్షాల ఐక్యత కోసమే తానిక్కడికి వచ్చానని, రాబోయే రోజుల్లో మరికొంతమంది నేతలను కలుసుకునే అవకాశం ఉందని చెప్పారు. మేమంతా ఐక్యంగా ఉన్నాం.. దాన్ని నిరూపిస్తాను అన్నారాయన .
తన యుక్త వయస్సునుంచే తనకు సీపీఎంతో అనుబంధం ఉందని.. నేనెప్పుడు ఇక్కడికి వచ్చినా ఈ పార్టీ ఆఫీసుకు వస్తుంటానని నితీష్ కుమార్ చెప్పారు. వివిధ రాష్ట్రాల్లోని వామపక్షాలను, ప్రాంతీయ పార్టీలను, కాంగ్రెస్ పార్టీని సమైక్యపరచాలన్నది తమ లక్ష్యమని, ఇదే జరిగితే అదొక పెద్ద ‘డీల్’ అవుతుందని ఆయన అన్నారు.
నితీష్ కుమార్ విపక్షంలోకి రావడం, బీజేపీ పై పోరుకు సిద్ద పడడం భారత రాజకీయాల్లో పెను సంకేతమని సీతారాం ఏచూరి అన్నారు. మొదట ప్రతిపక్షాలను సమైక్య పరచాలి.. అంతే తప్ప పీఎం అభ్యర్థి ఎవరన్నది కాదు అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయాన్నీ మీకు ఆ తరువాత చెబుతామన్నారు. నితీష్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ని కూడా కలిసి చర్చలు జరిపారు.
ఇంకా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ని కూడా ఆయన కలిసే అవకాశాలున్నాయి. అలాగే సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, ఐఎన్ఎల్డీ నేత ఓం ప్రకాష్ చౌతాలాతో కూడా ఆయన భేటీ కానున్నారు. తమ రాష్ట్రంలో తమ పార్టీకి సహకరించినందుకు నితీష్ కుమార్.. రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. అయితే నితీష్ ని ఉద్దేశించి బీహార్ మాజీ డిప్యూటీ సీఎం, బీజేపీ నేత సుశీల్ కుమార్ మోడీ సెటైర్ వేశారు. తాను పీఎం రేసులో లేనని నితీష్ చెప్పుకుంటున్నారని, కానీ ప్రధాని కావాలని ఆయన నోట్లో ‘లడ్డూ’ ఊరుతోందని అన్నారు. నితీష్ ని ఈ పదవికి రాహుల్ గానీ, మమతా బెనర్జీ గానీ, కేజ్రీవాల్ గానీ అంగీకరిస్తారా అని ఆయన వ్యాఖ్యానించారు.