బీహార్ లో ఈమధ్య సామాన్యుల ఖాతాల్లో కోట్లకు కోట్లు జమ అవుతున్నాయి. ఈమధ్యే కటిహార్ జిల్లాలో ఆరో తరగతి చదివే విద్యార్థి అకౌంట్ లో రూ.900 కోట్లకు పైగా చూపించగా.. తాజాగా ముజఫరాపూర్ జిల్లాలో ఓ రైతు ఖాతాలో రూ.52 కోట్లు పడ్డాయి.
రామ్ బహుదూర్ షా అనే రైతు పింఛన్ కు సంబంధించి ఆధార్, వేలిముద్ర వెరిఫికేషన్ కోసం బ్యాంకుకు వెళ్లాడు. ఈ క్రమంలో అకౌంట్ లో ఎంత మొత్తం ఉందో చెక్ చేయమని బ్యాంకు సిబ్బందిని అడగ్గా.. రూ.52 కోట్లు ఉన్నాయని చెప్పారు. దీంతో బహుదూర్ షా షాకయ్యాడు. అంత మొత్తం ఎక్కడి నుంచి వచ్చిందో తనకు తెలియదని చెప్పాడు. దీంతో బ్యాంకు అధికారులు ఎంట్రీ ఇచ్చి తాత్కాలికంగా అతడి అకౌంట్ ను నిలిపివేశారు.
రెండు రోజుల క్రితం ఆరో తరగతి చదివే ఇద్దరు విద్యార్థుల అకౌంట్స్ లో ఒకరికి రూ.900 కోట్లు, ఇంకొకరికి రూ.6 కోట్లకు పైగా నగదు ఉన్నట్లు చూపించింది. తర్వాత బ్యాంకు అధికారులు టెక్నికల్ ప్రాబ్లమ్ అని చెప్పారు. అంతకుముందు అయితే ఓ వ్యక్తి ఖాతాలో పొరపాటున రూ.5.5 లక్షలు జమవగా… ప్రధాని మోడీ ఆ డబ్బులు వేశారని అతను ఖర్చు చేసేశాడు. తాజాగా రైతు అకౌంట్ లో రూ.52 కోట్లు పడ్డాయి. తాను ఎన్నో కష్టాల్లో ఉన్నానని.. ఆ డబ్బులో నుంచి ఎంతోకొంత ఇవ్వాలని కోరుతున్నాడు రామ్ బహుదూర్ షా. అధికారులు నగదుపై విచారణ జరుపుతున్నారు.