సంక్రాంతి వేళ బీహార్ లో విషాదం చోటు చేసుకుంది. నలంద జిల్లాలో సంక్రాతి పండగ వేడుకల్లో కల్తీ మద్యం తాగిన ఘటనలో మృతుల సంఖ్య 11కి చేరింది. శనివారం ఈ ఘటన చోటుచేసుకోగా.. అప్పుడు ఆరుగురు మృతి చెందారు. అయితే.. చికిత్స పొందుతూ తాజాగా మరో ఐదుగురు మృతి చెందడంతో మృతుల సంఖ్య 11కి చేరింది.
రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమల్లో ఉన్నప్పటికీ.. కల్తీ మద్యం చాలా మంది ప్రాణాలను హరిస్తోందని పలువురు చెబుతున్నారు. నలందలోని చోటిపహరి, పహరితల్లి ప్రాంతాల్లో మద్యం తాగిన కొంతమంది అనారోగ్యానికి గురయ్యారు. దీంతో శనివారం మొత్తం 8 మంది మరణించగా.. ఈ రోజు మరో ముగ్గురు మృతిచెందినట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు.
మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కల్తీ మద్యాన్ని నియంత్రించడంలో విఫలమైన స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్ఓను సస్పెండ్ చేశారు. ఈ ఘటనలో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రస్తుతం బీహార్ లో మద్యపానం నిషేధం అమల్లో ఉంది. కానీ.. గత రెండు నెలల్లో కల్తీ మద్యం తాగి 40 మంది మృతిచెందారు. దీంతో, స్థానికంగా ఆందోళన వ్యక్తం అవుతోంది. తాజాగా జరిగిన ఈ ఘటనతో విషాదచాయాలు అలుముకున్నాయి.