బీహార్ ఎన్నికలు ముగిసినా… రాజకీయాల వేడి ఏమాత్రం తగ్గటం లేదు. ఆర్జేడీకి అంతా తానే అయి వ్యవహరిస్తున్న తేజస్వీ యాదవ్ బీజేపీకి చెక్ పెట్టేందుకు మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇటీవలి ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్ ఎల్జేపీ ఓట్లు చీల్చటంతో ఓడిపోయిన ఆర్జేడీ కూటమి… ఇప్పుడు చిరాగ్ ను తనవైపుకు తిప్పుకోవటంలో దాదాపు సక్సెస్ అయ్యింది.
చిరాగ్ పాశ్వాన్ తండ్రి రాంవిలాస్ పాశ్వాన్ మరణంతో ఖాళీ అయిన రాజ్యసభ సీటును ఆయన భార్య రీనా పాశ్వాన్ కు ఇస్తారని చిరాగ్ భావించారు. బీజేపీ పోటీ పెట్టదని అనుకున్నా… ఆ స్థానం నుండి మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ మోడీని బీజేపీ బరిలోకి దించింది. దీంతో రీనా పాశ్వాన్ కు ఆర్జేడీ మద్దతివ్వాలని నిర్ణయం తీసుకుంది. ఆయన కుటుంబం నుండి ఎవరైనా పోటీ చేస్తే పోటీ పెట్టబోమని కానీ వారు ముందుకు రాకపోతే మహాకూటమి అభ్యర్థి పోటీలో ఉంటారని తేజస్వీ ప్రకటించారు.
తేజస్వీ ప్రకటనతో చిరాగ్ మహా కూటమి వైపు అడుగులు వేసేలా కనపడుతున్నారు. ఇదే జరిగితే బీహార్ రాజకీయాలు మరోవైపు తిరుగుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.