బిహార్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న వ్యాన్ ఒకటి డ్యాంలో పడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, నలుగురు మునిగిపోయారు. మరో 19 మందికి గాయాలయ్యాయి. ఘటన సమయంలో వ్యాన్‌లో 26 మంది ప్రయాణికులు ఉన్నారు.
మహా శివరాత్రిని సందర్బంగా రోహ్తాస్ జిల్లా కరకట్ ప్రాంతానికి చెందిన 26 మంది యాత్రికులు కైమూర్ కొండలపై ఉన్న గుప్తేశ్వర్ మహాదేవ్ ఆలయాన్ని సందర్శించేందుకు బయలు దేరారు. ఈ రోజు ఉదయం 5 గంటల ప్రాంతంలో గైఘాట్ కొండపైకి ఎక్కుతుండగా వ్యాన్ బ్రేకులు ఫెయిల్ అయ్యాయి.
ఈ క్రమంలో వ్యాన్ అదుపు తప్పి 70 అడుగుల లోతున్న దుర్గావతి రిజర్వాయర్ ప్రాజెక్ట్ లో పడిపోయింది. వ్యాన్ తో పాటు ఏడుగురు ప్రయాణికులు డ్యాంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
గజ ఈతగాళ్లను రప్పించి డ్యాంలో గాలింపు చర్యలు చేపట్టారు. ముగ్గురి మృతదేహాలను వెలికి తీశారు. మరో నలుగురితోపాటు వ్యాన్ జాడ దొరకలేదు. గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను సమీపంలోని సదర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.