అది మహారాష్ట్రలోని గడ్చిరోలి ప్రాంతం దట్టమైన అటవీ ప్రాంతం.ఇక్కడి గిరిజనులంతా అడవితల్లిని నమ్ముకుని నివశిస్తున్నారు.దేశంలోఇంత టెక్నాలజీ వచ్చినా, అత్యాధునికి వైద్య సేవలు అందుబాటులోకి వచ్చినా. అనారోగ్యం వచ్చిందంటే గిరిపుత్రులకు ఆకుపసరే మందు, ప్రాణాలు నిలబెట్టమని ఆకాశానికే చూపు. భూమ్మీద నూకలుంటే ప్రాణాలు మిగులుతాయి. లేకుంటే ఇక్కడి కొండలు,లోయలు, నదులు తమలో కలిపేసుకుంటాయి.
మారుతున్న తరం ఇప్పుడిప్పుడే ఆసుపత్రుల మీద అవగాహన పెంచుకుంది.కానీ ఏ వైద్యసాయం వీరికి సకాలంలో అందదు. నడివగలిగిన రోగం వచ్చిందా సరి, నడవలేని పరిస్థితి వస్తే నులక మంచం మీద మైళ్ళ దూరం మోసుకుపోవాలి.
అంతలోపు ప్రాణం మిగిలితే ఆసుపత్రికి లేకుంటే కాటికి. గవర్నమెంట్లు మారుతున్నా వీరి పరిస్థితి మాత్రం మారలేదు. అటు మహారాష్ట్ర సరిహద్దులోని ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని గ్రామాల్లోని ప్రజలకు ఆరోగ్య సేవలు అందడం లేదు.
రోడ్డు సౌకర్యం, అటవీ ప్రాంతం సరిగా లేకపోవడంతో ప్రజలు పిహెచ్‌సికి వెళ్లేందుకు కాలినడకే గతి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం గిరిజనల చెంతకు ఆరోగ్య సేవలను అందించేందుకు సరికొత్త నిర్ణయం తీసుకుంది.
గడ్చిరోలి జిల్లాలోని సుదూర గ్రామాలకు మహారాష్ట్ర ప్రభుత్వం బైక్ అంబులెన్స్ సర్వీసులను ప్రారంభించింది. ఈ మోటారుసైకిల్ అంబులెన్స్‌లు రోగులు, గర్భిణీలు, శిశువులను మారుమూల ప్రాంతాల నుండి సమీప ప్రాథమిక లేదా కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలకు తీసుకెళ్తాయి.
ఈ ప్రత్యేకమైన బైక్ అంబులెన్స్ లకు రోగి సౌకర్యం కోసం సైడ్ క్యారేజ్‌ను అమర్చబడ్డాయి. అంతేకాకుండా అత్యవసర అవసరాలను తీర్చడానికి మందులు, ఫంక్షనల్ ఫస్ట్ ఎయిడ్ కిట్‌ను అందుబాటులో ఉంటాయి.
గడ్చిరోలి జిల్లాలో నేటికీ 122 గ్రామాలు వర్షాకాలంలో కనెక్టివిటీ సమస్యను ఎదుర్కొంటున్నాయని స్థానిక అధికారులు తెలిపారు. అదే సమయంలో సరైన రోడ్లు లేకపోవడంతో రోగులను పీహెచ్సీలకు తరలించేందుకు గ్రామాల్లో బైక్ అంబులెన్స్లను ప్రారంభించినట్లు చెప్పారు. రోగుల కోసం స్ట్రెచర్లు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. స్థానిక ఆశా వర్కర్లతో కలిసి బైక్ అంబులెన్స్లు పనిచేస్తాయన్నారు.