హైదరాబాద్ నగర నడిబొడ్డు బైక్ రేసింగ్ లు ఎక్కువయ్యాయి. నగర శివారుల్లో చేసుకునే రేసింగ్ లు నగరంలోకి చేరాయి. రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు యువత రేసింగులకు పాల్పడుతూ.. నగరంలో వీరంగం సృష్టిస్తున్నారు. 100 నుంచి 150 ద్విచక్రవాహనాలతో విన్యాసాలు చేస్తున్నారు.
అధిక వేగంతో రయ్‌రయ్‌మంటూ వెళ్తూ.. రోడ్లపై వెళ్లే ఇతర వాహనదారులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ముఖ్యంగా సైదాబాద్, మాదన్నపేట, చంద్రాయణగుట్ట, డబీర్‌పురా, చాదర్‌ఘాట్, చంచల్ గూడ ప్రాంతాల్లో రాత్రంతా బైక్ రేసింగులు జరుగుతున్నట్టు సమాచారం.
నిత్యం రద్దీగా ఉండే చంచల్ గూడ జైల్ రోడ్డులోనూ రాత్రంతా ఇలాంటి కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతున్నాయని స్థానికులు చెప్తున్నారు. యువకుల బైక్ రేసింగ్ లతో హడలెత్తిస్తున్నారని వాపోతున్నారు. పోలీసులు వెంటనే స్పందించి బైక్ రేసింగ్ లను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.
కాగా.. దీనికి సంబంధించి ఆయా ప్రాంతాలపై నిఘుపెట్టారు నగర పోలీసులు. రేసింగ్ లకు పాల్పడిన పలువురు యువకులను అరెస్టు చేసి.. రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. ఇకపై ఇలాంటి ఘటనలపై ప్రత్యేక దృష్టి పెడతామని వెల్లడించారు పోలీసు ఉన్నతాధికారులు.