కరోనా వైరస్ ప్రజలను ఎంతగా భయబ్రాంతులకు గురి చేస్తుందంటే ఎవరైనా తుమ్మినా…దగ్గినా వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో పబ్లిక్ గా తుమ్మినందుకు ఓ వ్యక్తిని చంపేంత పని చేశారు. కొల్హాపూర్ లోని గుజారి ప్రాంతంలో బైక్ పై వెళ్తున్న ఓ వ్యక్తి రోడ్డు మీద వెళ్తూ తుమ్మాడు. దానికి పక్క నుంచి బైక్ పై వెళ్తున్న వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ముక్కుకు టిష్యూ పేపర్, దస్తీ ఏది అడ్డం పెట్టుకోకుండా ఎలా తుమ్ముతావంటూ ప్రశ్నించారు. దీంతో వారిద్దరి మధ్య మాటా మాటా పెరిగి తుమ్మిన వ్యక్తిని చితకబాదారు. రోడ్డుపైనే ఇదంతా జరగడంతో వాహనాలన్నీ నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ సంఘటనకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అయితే దీనిపై ఎవరూ తమకు ఫిర్యాదు చేయలేదని పోలీసులు చెప్పారు.
మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి చాలా తీవ్రంగా ఉంది. ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు 49 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరనా వైరస్ సోకిన వ్యక్తి నుంచి ఇతరులకు ఉమ్ము, దగ్గు, తుమ్ములు, ముట్టుకోవడం వల్ల వ్యాపిస్తుంది.