కారణం లేకుండా స్టంట్లలో మా అంతటోళ్లు లేరు అనుకొని విర్రవిగి..బైక్ ల మీద రకరకాల విన్యాసాలు చేసి కొందరు కుర్రాళ్లు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. బైక్ స్టంట్స్ చేయడం అనేదేమి చిన్నపిల్లల ఆట కాదు. వాటిని చేయడానికి శిక్షణ అవసరం. అలా పూర్తిగా తర్ఫీదు పొందితేనే ఎక్కడైనా, ఎప్పుడైనా విన్యాస ప్రదర్శనలు ఇవ్వొచ్చు.
అసలు కారణం లేకుండా చేసే విన్యాసాలతో కొందరు తమ ప్రాణాలను ప్రమాదంలో పడేసుకోవడమే కాదు.. ఇతరులకు కూడా ఇబ్బందిని కలిగిస్తారు. కదులుతున్న బైక్ మీద విన్యాసాలు చేయడానికి ప్రయత్నించి..హీరో అవుదామని జీరో అవుతుంటారు. బైక్ చేతిలో ఉంటే చాలు..బైక్ పై నిలబడి నడపడం..బైక్ స్పీడ్ పెంచి ఇతరులను భయభ్రాంతులకు గురిచేయడం చేస్తుంటారు.
బైక్ స్టంట్ చేసేప్పుడు కాస్త అజాగ్రత్తగా ఉన్నా సరే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. అది తెలిసి కూడా ఉడుకు రక్తం కదా సినిమా స్టైల్లో బైక్ స్టంట్ చేద్దామమని ప్రాణాలు పోగొట్టుకోవడమే కాదు..ఇతరుల ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతాయని మరిచిపోతారు. వారు చేసే తప్పుకు మిగతా వారు కూడా అనుభవించాల్సి వస్తుంది. ఇలా బైక్ స్టంట్ చేస్తూ..ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు నగరంలోని కుర్రాళ్లు.
హైదరాబాద్ లో ఇలాంటి ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. బైక్ పై స్టంట్ చేస్తూ తోటి వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. మలక్ పేట్, చంచల్ గూడ ప్రధాన రహదారి పై బైక్ లతో స్టంట్ చేస్తూ స్థానికులను భయపెడుతున్నారు. ఇటీవల పోకిరిల స్టంట్స్ వల్ల పలువురు వాహనదారులు గాయలపాలయ్యారు. ఇలాంటి వారి పై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.