ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని మియాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో వరుసగా జరుగుతున్న బైకు దొంగతనాలపై దృష్టిసారించిన పోలీసులు ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు.
నిందితుని నుంచి తొమ్మిది లక్షల రూపాయల విలువ చేసే పదహారు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మియాపూర్ మెట్రో రైల్ స్టేషన్ వద్ద వాహనాల తనిఖీ చేపడుతుండగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తారసపడ్డాడని డీసీపీ పేర్కొన్నారు.
అతనిని విచారించగా ద్విచక్ర వాహనాలను దొంగలించే నిందితుడిగా గుర్తించి…అతని వద్ద ఉన్న 16 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని శిల్పవల్లి వివరించారు. నిందితుడు జగిత్యాల జిల్లాకు చెందిన రంగు గంగాధర్ హైదరాబాద్ నగరానికి జీవనోపాధి కోసం వచ్చాడని ఆమె తెలిపారు.
దురలవాట్లు, జల్సాలకు అలవాటుపడి డబ్బు కోసం ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్నాడని పేర్కొన్నారు. నిందితుడు గంగాధర్ మియాపూర్ 5, సనత్‌నగర్ 3, మాదాపూర్ 1, కూకట్‌పల్లి రెండు, కేపీహెచ్‌జీ ఒకటి, ఉప్పల్, ఎల్బీనగర్ నాలుగు ద్విచక్ర వాహనాలను అపహారించి ఓఎల్‌ఎక్స్ ద్వారా విక్రయిస్తున్నట్లు గుర్తించినట్లు డీసీపీ శిల్పవల్లి మియాపూర్ పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరించారు.
నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో డీసీపీతోపాటు మాదాపూర్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ నంద్యాల నరసింహారెడ్డి ,ఏసిపి నరసింహారావు మియాపూర్ ఇన్‌స్పెక్టర్ తిరుపతిరావు మియాపూర్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ కాంతా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.