– ప్రాజెక్టు మాటున మెగా మోసం!
– నిపుణుల సూచనల్ని పట్టించుకోని వైనం
– ఖర్చు రూ.50.. ప్రయోజనం రూ.10
– ముందే హెచ్చరించిన నీటిరంగ నిపుణులు
– ఎవరి మాట వినకుండా సర్వనాశనం!
– ప్రజాధనం ఆవిరి.. మేఘాకు పెరిగిన సిరి!
ప్రతిష్టాత్మకం.. దేశానికే ఆదర్శం.. అంటూ కాళేశ్వరం ప్రాజెక్టుతో కేసీఆర్ చేసిన హడావుడి చూస్తూనే ఉన్నాం. అయితే.. వరదల పుణ్యమా అని ప్రాజెక్టు మాటున జరిగిన మెగా మోసాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. పంప్ హౌస్ లు మునిగిపోవడం అదనపు ఖర్చు అయితే.. ఇప్పుడు భవిష్యత్ భయాలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్ట్ కు ఇంకా డబ్బులు తగలెయ్యడం అవసరమా? అనే ప్రశ్న ఉత్పన్నమౌతోంది. ఇంత గొప్ప ప్రాజెక్టు అని చెప్పుకునే ప్రభుత్వం ఎలాంటి ఒంటెద్దు పోకడలకు పోయిందో నీటి రంగ నిపుణులను కలిస్తే అర్థం అవుతోంది. తాజాగా తొలివెలుగుతో అంతర్జాతీయ నీటి రంగ నిపుణులు బిక్షం గుజ్జా మాట్లాడారు. కాళేశ్వరం నిర్మాణానికి ముందు నుంచి జరిగిన కొన్ని అంశాలను ఎక్స్ క్లూజివ్ గా తొలివెలుగుతో పంచుకున్నారు.
కాళేశ్వరం అనౌన్స్ మెంట్ వచ్చినప్పుడు అసలు.. ఈ ప్రాజెక్ట్ ఏంటి.. దాని వల్ల లాభాలేంటి, నష్టాలేంటి? రైతులకు ఎంతవరకు ఉపయోగం లాంటి అంశాలపై రీసెర్చ్ చేసి మరో ఇద్దరితో కలిసి ఓ పుస్తకం తీసుకొచ్చారు బిక్షం గుజ్జా. ఈ పుస్తకం ఉద్దేశం ఏంటంటే.. ఖర్చులు, టెక్నికల్ సమస్యలను ఎలా అధిగమించాలి.. మెయింటెనెన్స్ గురించి ఆలోచన చేయాలని. కానీ.. తాము చెప్పింది కొంత వరకు అన్నా పరిగణనలోకి తీసుకుంటారని.. వీలైనంత వరకు ఖర్చు తగ్గిస్తారని అనుకుంటే అలాంటిదేం జరగలేదని అంటున్నారు బిక్షం. పైగా ఆనాడు ప్రాజెక్టును అడ్డుకుంటే తెలంగాణకు వ్యతిరేకం, రైతులకు వ్యతిరేకం అని చిత్రీకరించేవారని గుర్తు చేశారు. అన్నింటి గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకుని ఉంటే వేల కోట్లు మిగిలి ఉండేవన్నారు.
లక్షా 20వేల కోట్ల ప్రాజెక్టు అంటే నిపుణులతో రివ్యూ చేయాలి. కానీ.. సారు అలాంటిదేం చేపట్టలేదు. చిన్న ఇల్లు కడితేనే అందర్నీ సంప్రదిస్తాం.. అలాంటిది ఇంత పెద్ద ప్రాజెక్టు కడుతుంటే నిపుణులను సంప్రదించకపోవడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అసలు.. ఈ ప్రాజెక్టు ఉద్దేశం ఏంటి? రైతులకు నీళ్లు అందించడమే. 18 లక్షల ఎకరాలు, కోటి ఎకరాలకు నీళ్లిస్తామని అన్నారు. తీరా 20 వేల ఎకరాలకు కూడా నీళ్లు అందలేదనే విమర్శలు ఉన్నాయి. ఇంత పెద్ద ప్రాజెక్టుకు సేఫ్టీ, సెక్యూరిటీ అదేని చాలా ముఖ్యం. ఇందులో భాగంగా కట్టిన జలాశయాలు ప్రమాదకరంగా మారే ఛాన్స్ ఉంది. అయినా.. రూ.50 వేలు ఖర్చు పెట్టి రూ.10 వేల సాయం చేయడం కరెక్టేనా అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. ఎలాంటి రివ్యూలు చేయకుండా డబ్బా కొట్టుకోవడంతో అనేక అనుమానాలకు తావిస్తోంది.
కాళేశ్వరం విషయంలో డీపీఆర్ లు కూడా సీరియస్ గా చేసినవి కావనేది నిపుణుల మాట. పైగా సీఎం చెప్పినట్లు.. క్లౌడ్ బరస్ట్ మళ్లీ రాదనే ఛాన్స్ ఉందా? ప్రాజెక్ట్ గురించి ముందే హెచ్చరించినా పట్టించుకోలేదని అంటున్నారు. కాళేశ్వరంలో ఎన్నో రకాల సిస్టమ్స్ ఉన్నాయి. చిన్న దాంట్లో తేడా వచ్చినా మొత్తం ఆగిపోవాల్సిందే. ఒకే నీరును 9 సార్లు ఎత్తపోయాలి.. ఇదో పెద్ద సిస్టమ్. ప్రతీది వందశాతం పని చేయాలి. లేకపోతే సమస్యలు.. తిప్పలు తప్పవు. అందుకే ఇప్పటికైనా రివ్యూ చేయమని నిపుణులు అడుగుతున్నారు. లేకపోతే ప్రాజెక్ట్ సరైనది కాదనే ముద్ర పడిపోతుందని హెచ్చరిస్తున్నారు. అయినా.. ఇదేమన్నా సొంత పైసలతో కట్టేదా? ప్రజల సొమ్ముతోనేగా. అలాంటి ప్రాజెక్టుకు క్రెడిబిలిటీ ఉండాలి కదా అని చెబుతున్నారు.
ప్రాజెక్టు నిర్మాణానికి ముందు సోవియట్ యూనియన్ హయాంలో కజకిస్తాన్ లో ఇలాంటి ప్రాజెక్ట్ కట్టారని చెప్పామన్నారు బిక్షం గుజ్జా. ఖర్చు ఎక్కువ.. ఉపయోగం తక్కువ అవడంతో దాన్ని నిలిపివేశారని గుర్తు చేశారు. అప్పట్లోనే దీని గురించి హెచ్చరించినా.. అక్కడకు వెళ్లి సమీక్ష జరపమని చెప్పినా పట్టించుకోలేదని వివరించారు. తప్పులు సహజమే.. ఇప్పుడైనా కజకిస్తాన్ వెళ్లి రివ్యూ చేయడం అవసరమని సూచిస్తున్నారు. 18 లక్షల ఎకరాలకు సాగు నీరు అని చెప్పినా.. దానిపైనా ఓ ప్రణాళిక లేకుండా చేస్తున్నారని అన్నారు. అంటే.. ఓ షెడ్యూల్ ప్రకారం ఏ మండలానికి ఎప్పుడు నీళ్లిచ్చేది పక్కాగా చేయడం లేదని తెలిపారు.