మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ 67 ఏళ్ళ బిల్ గేట్స్ మళ్ళీ ప్రేమలో పడ్డారు. పౌలా హర్డ్ అనే వితంతువుతో ఆయన డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. ఈమె మరెవరో కాదు. 2019 లో క్యాన్సర్ తో మరణించిన ఒరాకిల్ సాఫ్ట్ వేర్ కంపెనీ సీఈఓ మార్క్ హర్డ్ భార్య.. 60 ఏళ్ళ పౌలాతో బిల్ గేట్స్ సుమారు సంవత్సర కాలంగా డేటింగ్ చేస్తున్నారు. పౌలాకు పిల్లలున్నా వారిని ఆమె ఇప్పటికీ కలుసుకోలేదని ‘పీఫుల్’ అనే పత్రికకు చెందిన వర్గాలు తెలిపాయి.
గత నెలలో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ ఓపెన్ టెన్నిస్ గేమ్ సందర్భంగా పౌలా, బిల్ గేట్స్ ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఒకరి పక్కనే మరొకరు కూర్చుని వీరు ఆట చూశారు. ఈ ఇద్దరినీ విడదీయలేని కపుల్ గా భావిస్తున్నామని, పౌలా ఎప్పుడూ ‘మిస్టరీ వుమనే’ అని వీరి సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.
ఏమైనా వీరు రొమాంటిక్ రిలేషన్ షిప్ లో ఉన్నారన్నది తథ్యం అని వివరించాయి. ఈవెంట్ ప్లానర్ గా పని చేస్తున్న పౌలా హర్డ్.. లోగడ టెక్ ఎగ్జిక్యూటివ్ గా కూడా పని చేశారట. టెన్నిస్ అంటే బిల్ గేట్స్ కి, ఈమెకు కూడా ఇష్టం కావడంతో ఇద్దరూ దగ్గరయ్యారు. పౌలాకు ఇద్దరు కూతుళ్లున్నారు. గత ఏడాది సెప్టెంబర్ 23 న లండన్ లో జరిగిన లేవర్ కప్ టోర్నమెంట్ ని కూడా బిల్ గేట్స్, పౌలా కలిసే చూశారు.
మెలిండా ఫ్రెంచ్ గేట్స్, బిల్ గేట్స్ ఇద్దరూ 2021 మే నెలలో విడాకులు తీసుకున్నారు. 30 ఏళ్ళ తమ వైవాహిక జీవితానికి స్వస్తి చెప్పారు. అదే ఏడాది ఆగస్టులో వీరి డైవోర్స్ ఖరారయింది. అయితే తాము నిర్వహించిన ఫౌండేషన్ ని ఇద్దరూ కలిసి కొనసాగించాలని అప్పట్లో నిర్ణయం తీసుకున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో తాము విడాకులు తీసుకుంటున్నామని బిల్ గేట్స్ నాడు ప్రకటించారు.