తెలంగాణ రాష్ట్రంలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ వర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన బిల్లును కూడా పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఆమోదించనుందని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న 24 బిల్లుల్లో ఈ వర్సిటీ బిల్లు కూడా ఉందని ఓ బులెటిన్ రిలీజ్ చేసింది.
కేంద్రీయ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు, 2022ను కేంద్ర విద్యాశాఖ పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు లోక్‌సభ, రాజ్యసభ సచివాలయాలకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సమాచారమిచ్చింది. ఈ మేరకు వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టబోయే, ఆమోదించబోయే బిల్లుల జాబితాలో ఈ బిల్లును చేర్చినట్లు తెలిపింది.
మరోపక్క తెలుగు రాష్ట్రాల్లో గిరిజన విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విషయం తెలిసిందే. గిరిజన వర్సిటీ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం భూకేటాయింపులో జాప్యం చేయడం వల్ల సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉంది. చాలా ఏళ్ల తర్వాత ములుగు జిల్లా జాకారంలో గిరిజన వర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించగా కేంద్ర ప్రభుత్వం దాన్ని ఖరారు చేసింది.
ఇక, ఈ పార్లమెంట్ సమావేశాల్లో గిరిజన విశ్వవిద్యాలయం బిల్లు ఖచ్చితంగా ఆమోదం పొందుతుందని, తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు అవుతుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది.