కల్యాణ్ రామ్ హీరోగా నటించిన సినిమా బింబిసార. ఈ వీకెండ్ థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమా నాన్-థియేట్రికల్ బిజినెస్ క్లోజ్ అయింది. మూవీ శాటిలైట్, డిజిటల్ రైట్స్ ను జీ తెలుగు ఛానెల్ దక్కించుకుంది. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం, 19 కోట్ల రూపాయలకు ఈ సినిమా నాన్-థియేట్రికల్ లాక్ అయినట్టు తెలుస్తోంది. అది కూడా కేవలం తెలుగు కాకుండా, సౌత్ లాంగ్వేజెస్ మొత్తం ఈ డీల్ లో కలిసి ఉన్నట్టు సమాచారం.
భారీ బడ్జెట్ తో బింబిసార సినిమాను తెరకెక్కించాడు కల్యాణ్ రామ్. నాన్-థియేట్రికల్ పై నమ్మకంతో బాగా డబ్బులు పెట్టాడు. నిజానికి కల్యాణ్ రామ్ ఆశించిన మొత్తం 32 కోట్ల రూపాయలు. అటుఇటుగా కాస్త తగ్గినా, పాతిక గ్యారెంటీ అనుకున్నాడు. కానీ రిలీజ్ డేట్ దగ్గరపడడంతో, తప్పనిసరి పరిస్థితుల మధ్య 19 కోట్ల రూపాయలకు రైట్స్ ఇచ్చేయాల్సి వచ్చింది.
ఎందుకంటే, రిలీజ్ తర్వాత నాన్-థియేట్రికల్ బిజినెస్ చేయడం అనేది రిస్క్ తో కూడిన వ్యవహారం. సినిమా సూపర్ హిట్టయితే కోరినంత ఇవ్వడానికి ఛానెల్స్ ముందుకొస్తాయి. అదే రిజల్ట్ తేడా కొడితే మాత్రం రిలీజ్ కు ముందు అనుకున్న మొత్తంలో నాలుగో వంతు కూడా రాదు. ఈ రిస్క్ ను దృష్టిలో పెట్టుకొని విడుదలకు సరిగ్గా కొన్ని రోజుల ముందు అయినకాడికి సినిమాను అమ్మేశాడు కల్యాణ్ రామ్. ఇతడి కెరీర్ లో బిగ్గెస్ట్ నాన్-థియేట్రికల్ డీల్ ఇదే.
ఇక థియేట్రికల్ విషయానికొస్తే.. వరల్డ్ వైడ్ ఈ సినిమాను 15 కోట్ల 50 లక్షల రూపాయలకు అమ్మారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 13 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. నాన్-థియేట్రికల్ మొత్తంతో కలిపి చూసుకుంటే.. కల్యాణ్ రామ్ కు అటుఇటుగా పెట్టిన పెట్టుబడి వచ్చినట్టయింది. ఇక బయ్యర్లు గట్టెక్కుతారా లేదా అనేది థియేట్రికల్ సక్సెస్ పై ఆధారపడి ఉంది.