వరుస ప్రమాదాలతో వార్తల్లో నిలిచి, ఇటీవలే పున ప్రారంభమైన బయోడైర్సిటీ ఫ్లైఓవర్ మరోసారి వార్తలకెక్కింది. కఠిన నిబంధనలు అమలు చేస్తామని చెబుతూ, భద్రతా ప్రమాణాలు ఏర్పాటు చేశామని.. ఇక ప్రమాదాలు నివారిస్తామని చెప్పిన మాటలు 5రోజుల్లోనే తేలిపోయాయి. ఫ్లైఓవర్‌పై వెళ్లే వాహనదారులు నిబంధనలు పట్టించుకోకపోవటంతో భారీగా చలనాలు వస్తున్నాయి. కేవలం 5రోజుల్లోనే లక్షల రూపాయాల చలానాలు విధించారు అధికారులు.
స్పీడ్ 40కి మించరాదు, ఎవరికి నిర్దేశించిన లైన్‌లోనే వారు వెళ్లాలి అంటూ పోలీస్‌లు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఓవర్ స్పీడ్ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ ఫ్లైఓవర్ తిరిగి ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు 629 ఉల్లంఘనలు జరిగాయి. ఒక్కో ఉల్లంఘనలకు 1100చొప్పున ఫైన్ వేయగా… 6,91,900 జరిమానా చెల్లించాల్సి ఉంది. అధిక వేగం, ర్యాష్ డ్రైవింగ్‌కు పాల్పడినట్లు తేలింది. ఎక్కువగా టూవీలర్ వాహనదారులే ఉన్నారని, బైక్‌ల కోసం ఏర్పాటు చేసిన లైన్ క్రాస్ చేశారని తెలుస్తోంది.
దీంతో ప్రభుత్వం, ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్‌ఎంసీ తీసుకున్న చర్యలు పెద్దగా పనికి వచ్చేలా కనపడటం లేదు. మరోసారి ఎవరి జీవితాలను కోల్పోకముందే అధికారులు మరోసారి ఫ్లైఓవర్‌ను సందర్శించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.