హైదరాబాద్ లో వ్యాక్సిన్లు తయారు చేసే రెండు పెద్ద సంస్థలు.. హైదరాబాద్ బయాలజికల్ ఈ లిమిటెడ్, భారత్ బయో టెక్ కంపెనీలు తాము 25 కోట్ల వ్యాక్సిన్ డోసులను సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, ఆర్దర్లు అందగానే వీటిని పంపిణీ చేస్తామని ప్రకటించాయి. వీటిలో బయాలజికల్ ఈ లిమిటెడ్ కంపెనీ… తమ కోర్బెవాక్స్ వ్యాక్సిన్ డోసులు సుమారు 20 కోట్ల వరకు ఉన్నట్టు వెల్లడించగా.. భారత్ బయో టెక్ సంస్థ.. 5 కోట్ల కోవాగ్జిన్ డోసులు ఉన్నట్టు తెలిపింది.
తమ సంస్థ మొత్తం సుమారు 30 కోట్ల కోర్బెవాక్స్ వ్యాక్సిన్ డోసులను ఉత్పత్తి చేసిందని బయాలజికల్ ఈ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డా. విక్రమ్ పరాద్కర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్దర్లు రాగానే వీటి పంపిణీకి ఉపక్రమిస్తామన్నారు. గత మార్చి నెలలో ఈ సంస్థ ప్రభుత్వానికి 10 కోట్ల డోసులను అందజేసింది. ప్రస్తుతం తమవద్ద ఉన్నడోసులన్నింటినీ పూర్తిగా పరీక్షించామని, ఇవి సురక్షితమైనవని పరాద్కర్ చెప్పారు. ఇవి యాంటిజెన్ కి సమానమైనవన్నారు.
అమెరికా.. టెక్సాస్ లోని రెండు సంస్థల సహకారంతో తాము వ్యాక్సిన్ ని ఉత్పత్తి చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో వచ్చే ఆర్దర్లను బట్టి 8 వారాల్లోగా అదనంగా వ్యాక్సిన్ సప్లయ్ చేయగలమని, సుమారు 10 కోట్ల డోసుల వరకు కూడా అందజేయగలని ఆయన వివరించారు.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ ఇన్స్ టి ట్యూట్ ఆఫ్ వైరాలజీ సహకారంతో కొవాగ్జిన్ వ్యాక్సిన్ తయారు చేస్తున్న భారత్ బయో టెక్.. ఈ యేడాది ఆరంభంలో డిమాండ్ తగ్గిన కారణంగా దీని తయారీని నిలిపివేశామని వెల్లడించింది. అయితే 5 కోట్ల డోసులు వచ్చే సంవత్సరం తొలి మూడు నాలుగు నెలల్లో సప్లయ్ చేసే అవకాశాలు ఉన్నట్టు ఈ సంస్థకు చెందిన వర్గాలు చెప్పాయి. ఆ తరువాత వీటి కాలపరిమితి ముగుస్తుందని పేర్కొన్నాయి. ఆర్దర్లు అందిన పక్షంలో తిరిగి కొవాగ్జిన్ వ్యాక్సిన్ ఉత్పత్తి అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.