మణిపూర్ సీఎం ఎన్. బీరెన్ సింగ్ భారీ విజయం సాధించారు. హీగాంగ్ నియోజకవర్గం నుంచి బరిలో దిగిన బీరెన్ సింగ్.. కాంగ్రెస్ అభ్యర్థి పంగీజం శరత్‌చంద్ర సింగ్ పై 18 వేల ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. దీంతో ఐదోసారి ఎమ్మెల్యేగా ఎన్నకై అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.
బీరెన్ సింగ్ రాజకీయాల్లోకి రాక ముందు ఫుట్‌బాల్ క్రీడాకారుడుగా రాణించారు. కొన్నాళ్లు జర్నలిస్ట్ గా కూడా పనిచేశారు. ఆయా రంగాల్లో తనదైన గుర్తింపును సంపాదించుకున్న తర్వాత ఆయన రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేశారు. మొదటి సారి 2002లో డెమోక్రటిక్ రివల్యూషనరీ పీపుల్స్ పార్టీ నుండి హెయ్‌గాంగ్ స్థానం నుంచి గెలుపొందారు.
2007లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఆ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. 2012లో మళ్లీ అదే స్థానం నుంచి గెలుపొంది కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవిని చేపట్టారు. 2016 అక్టోబర్‌లో కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి ఓక్రమ్ ఇబోబి సింగ్‌పై జరిగిన తిరుగుబాటు కారణంగా కాంగ్రెస్ కు రాజీనామా చేసిన బీరెన్ సింగ్.. బీజేపీలో చేరారు.
తర్వాత 2017 ఎన్నికల్లో బీజేపీ బీఫాంతో పోటీ చేసి అదే స్థానం నుండి మళ్లీ గెలుపొందారు. ఆ ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత అతన్ని సీఎం అభ్యర్ధిగా ప్రకటించింది బీజేపీ అధిష్ఠానం. అప్పటి నుండి పార్టీ పగ్గాలు అందుకున్న బీరెన్ సింగ్.. పార్టీను ముందుకు నడిపిస్తున్నారు.