తెలంగాణ విద్యాశాఖ పదో తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. చివరి 15 నిమిషాల్లోనే బిట్ పేపర్ ఇవ్వాలని డిసైడ్ అయింది. ఇప్పటి వరకు 11 పేపర్లతో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ నిర్వహిస్తుండగా.. 6 పేపర్లకు కుదించినట్లు విద్యాశాఖ ప్రకటించింది.
దీంతో పాటు ఈ అకడమిక్ ఇయర్ లో ఎగ్జామ్స్ వంద శాతం సిలబస్ తో జరగనున్నాయి. ఈ పరీక్షల్లో భాగంగా స్టూడెంట్స్ కు ఇచ్చే మల్టీపుల్ చాయిస్ బిట్ పేపర్ ను చివరి 15 నిమిషాల ముందే ఇవ్వాలని విద్యాశాఖ సూచించింది. అదే విధంగా జనరల్ సైన్స్ పరీక్షలోని రెండు ప్రశ్నపత్రాలు ఓకేసారి కాకుండా నిర్దేశించిన సమయానికి విద్యార్థులకు వేర్వేరుగా ఇవ్వాలని పేర్కొంది.
దీనికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన, పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు జిల్లా అధికారులతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో స్పష్టం చేశారు. ఇక ఈ ఏడాది టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ను ఆరు పేపర్లుగానే నిర్వహిస్తున్న నేపథ్యంలో జనరల్ సైన్స్ పరీక్షలో 40 మార్కుల చొప్పున రెండు పేపర్లుంటాయి. ఇందులో ఒకటి ఫిజికల్ సైన్స్ కాగా మరొకటి బయాలాజికల్ సైన్స్. జనరల్ సైన్స్ తో ముందుగా ఓ పేపర్ ఇచ్చి అది రాసేందుకు 90 నిమిషాల సమయం ఇవ్వాలని అధికారులకు సూచించింది విద్యాశాఖ.
తరువాత 20 నిమిషాల సమయం ఇచ్చి రెండో పేపర్ విద్యార్థులకు ఇవ్వనున్నారు. అయితే రెండో పేపర్ రాయడానికి కూడా 90 నిమిషాల సమయాన్ని కేటాయించడం జరుగుతుంది. ఇక మల్టీపుల్ ఛాయిస్ కింద పది ప్రశ్నలిచ్చి.. దాని కోసం 15 నిమిషాల సమయాన్ని కేటాయించడం జరుగుతుంది.
కాగా రాతపరీక్షకు 80 మార్కులు, ఫార్మటివ్ అసెస్మెంట్ కు 20 మార్కులుంటాయి. ఇక అన్ని ఎగ్జామ్స్ కు 3 గంటల సమయం కేటాయించగా.. సైన్స్ కు మాత్రం 3.20 గంటల సమయం ఉంటుంది. అయితే స్టూడెంట్స్ కు కన్ఫ్యూజన్ లేకుండా త్వరలోనే మోడల్ పేపర్లను అందుబాటులోకి తీసుకొని వస్తామని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.