మహేష్ బ్యాంక్ నిధుల గల్లంతు కేసులో సీసీఎస్ పోలీసులకు చేదు అనుభవం ఎదురైంది. నిందితులను అదుపులోకి తీసుకోవడానికి వెళ్లిన పోలీసులపై ఎదురుదాడి జరిగింది. కేసు దర్యాప్తులో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నట్టు తెలింది. అందులో భాగంగా వారిని అదుపులోకి తీసుకోవడానికి ఇటీవల ఢిల్లీకి ఓ బృందం వెళ్లింది.
కేసులో ప్రధాన నిందితులకు సహకరించిన ఓ నైజీరియన్ ను అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో అప్రమత్తం అయిన నిందితుడు పోలీసులపైనే ఎదురు దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఒకరికి తీవ్ర గాయాలయినట్టు తెలుస్తోంది. గాయాలైన అధికారికి అక్కడే చికిత్స అందిస్తున్నట్టు సమాచారం.
అయితే.. ఈ విషయాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు గోప్యంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కూడా పలు సందర్భాల్లో రాజస్థాన్ బీహార్ వంటి రాష్ట్రాలకు వెళ్లిన పోలీసులపై ఇదే తరహాలో దాడులు జరిగాయి. ఆయా రాష్ట్రాల్లో స్థానిక పోలీసులు సహకరించకపోవడం కూడా ఇలాంటి ఘటనలకు ఆస్కారం ఇస్తోందని పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మహేష్ బ్యాంక్ సర్వర్ హ్యాకింగ్ కేసులో ఇప్పటికే పటువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందులో కొందరిని కోర్ట్ లో హాజరుపరిచారు. ఇంకొందరిని విచారిస్తున్నారు. విచారణలో భాగంగా నైజీరియాకు చెందిన వ్యక్తులు ఉన్నట్టు వెలువడింది. వారిని అదుపులోకి తీసుకోవడానికి వెళ్లిన పోలీసులపై ఎదురుదాడి జరిగినట్టు తెలుస్తోంది.