టీవీ,ఓటీటీ లాంటి మాధ్యమాల్లో చూపించే వంటల ప్రోగ్రామ్స్ లో కమ్మని వంటలే కాదు కడుపుబ్బ నవ్వించే కామెడీలు కూడా జరుగుతుంటాయి. తయారు చేసిన వంటపదార్థాలు బావున్నా లేకున్నా..మాడినా మసైనా ఆహాఓహో అనాలి. అయితే ప్రస్తుత కాలంలో కొత్తకొత్త వంటలు తినాలి, తయారు చేయాలి అనుకునే యువత పెరిగింది. అందుకే ఆ మేరుకు వంటల ప్రోగ్రామ్స్ క్రేజ్ కూడా పెరింగింది. పోటీలకైతే మరీను.
ప్రోగ్రామ్ లో జరిగే తమాషాలు ఎలాగూ జరుగుతాయి. వీటికి సంబంధించిన ఆడిషన్లలో కూడా చిత్రవిచిత్రాలు చోటు చేసుకుంటాయి. అలాంటిదే పాకిస్థానీ కుకింగ్ షో నుండి లీకైన ఓ ఆడిషన్ క్లిప్. ఓ మహిళ తీసుకువచ్చిన బిర్యానీ వంటకాన్ని టేస్ట్ చేసేందుకు జడ్జీల ముందు పెడుతుంది.సాధారణంగా చాలా మంది చేసిన వంటతో పాటు చూడడానికి అందంగా ఉండాలన్న ఉద్దేశంతో తాము చేసిన రెసిపీని బౌల్ లో వేసి, దానికి డెకరేషన్ కూడా చేస్తూ ఉంటారు.
అయితే అలా ఎలాంటి చిన్నపాటి డెకరేషన్ కూడా లేకుండా మీరు చేసిన బిర్యానీని ఓ మామూలు బాక్స్ లో తీసుకొచ్చారెందుకని ఆ మహిళ జడ్జీలు అడుగుతారు. దానికి ఆమె సమాధానంగా.. తాను బిర్యానీ తీసుకుని రెస్టారెంట్ నుంచి నేరుగా ఇక్కడికే వచ్చానని తెలిపింది. తమ ప్రాంతంలో ఇదే బెస్ట్ బిర్యానీ అని కూడా చెప్పింది.
మహిళ సమాధానానికి ఆశ్చర్యపోయిన జడ్జెస్.. మీరు స్వయంగా చేసి తీసుకురావాలి కదా..రెస్టారెంట్ నుంచి కొనుక్కురావడం ఏంటీ అని ప్రశ్నించారు. అయితే స్వయంగా చేసుకొని రావాలని తనకు చెప్పలేదని ఆ మహిళ స్పష్టం చేసింది. మహిళ సమాధానంతో అసంతృప్తి వ్యక్తం చేసిన న్యాయ నిర్ణేతలు.. ఆమెను అక్కడ్నుంచి వెళ్లిపొమ్మని చెప్పారు.
దానికి ఆమె స్పందిస్తూ.. తాను కష్టపడి బిర్యానీ తీసుకువచ్చానని, ఖచ్చితంగా రుచి చూడాల్సిందేనని పట్టుబట్టింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. టీఆర్పీ కోసం మీరు వేసిన ప్లాన్ బాగుందంటూ కొందరు నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు.