ప్లైయింగ్ సాసర్స్, ఏలియన్స్ గురించి చదివి ఉంటాం, సినిమాల్లో కూడా చూసి ఉంటాం. వాటి మీద మనకు ఎన్నో ఆలోచనలు,అనుమానాలు,ఊహలు, అపోహలతో బాటు చూడాలనే చిన్నపాటి ఎక్సైట్ మెంటు కూడా ఉంటుంది. అయితే అలాంటి ఫ్లైయింగ్ సాసర్ ఆకాశంలో స్పష్టంగా కనిపిస్తే ఇంకెంత ఎక్సైటింగ్ గా ఉంటుందో కదా.!
టర్కీలోని బుర్సా పట్టణంలో అలాంటి ఓ అద్భుతం చోటుచేసుకుంది. ఉదయంపూట ఆకాశంలో ఓ పెద్ద ఫ్లైయింగ్ సాసర్ కనిపించింది. దీంతో బుర్సా వాసులు ఆశ్చర్యపోయారు. గ్రహాంతరవాసులు నేలపైకి వస్తున్నారేమోనని చాలామంది భయాందోళనకు లోనయ్యారు.
కాసేపటి తర్వాత ఆకాశంలో కనిపిస్తున్నది గ్రహాంతరవాసుల ఫ్లైయింగ్ సాసర్ కాదని తేలిపోయింది. ఓ భారీ మేఘం ఇలా విచిత్రమైన ఆకారం దాల్చిందని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. కొంతమంది ఈ వింతను తమ కెమెరాలలో బంధించారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టడంతో.. ఇప్పుడు అవి వైరల్ గా మారాయి.
ఆకాశంలో ఈ వింత మేఘాలు ఏర్పడడంపై టర్కీ మెటరలాజికల్ సంస్థ ప్రతినిధి వివరణ ఇచ్చారు. ఇలాంటి మేఘాలు 2 వేల నుంచి 5 వేల మీటర్ల ఎత్తున్న పర్వత ప్రాంతాల్లో మాత్రమే ఏర్పడతాయని చెప్పారు. ఎత్తైన ప్రదేశాల్లో గాలుల వేగం క్షణక్షణానికీ మారుతుందని, బలమైన గాలులు వీస్తున్నప్పుడు ఉన్నట్టుండి ప్రశాంతత నెలకొంటుందని చెప్పారు.
గాలి వేగంలో చోటుచేసుకునే అసాధారణ మార్పులవల్లే ఇలాంటి అసాధారణ మేఘాలు ఏర్పడతాయని వివరించారు. ఈ మేఘాలు కనిపించాయంటే ఆ రోజు లేదా ఆ మరుసటి రోజు వర్షం కురుస్తుందని చెప్పారు.
#Turkey an unusual dawn this morning. Footage of a rare natural phenomenon called #UFO lenticular/spying foehn clouds. 🇹🇷 pic.twitter.com/Mw9SJx3mAN
— ByronJ.Walker™Quotes (@ByronJWalker) January 21, 2023